Parliament: సాక్ష్యాధారాలను నాశనం చేయడంలో ప్రమేయం..! మరో నిందితుడికి పోలీస్‌ కస్టడీ

పార్లమెంటులో అలజడి ఘటనకు సంబంధించి ఆరో నిందితుడికి దిల్లీ న్యాయస్థానం ఏడు రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది.

Updated : 16 Dec 2023 20:15 IST

దిల్లీ: పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటన (Parliament Security Breach Case)లో మరో నిందితుడికి దిల్లీ కోర్టు ఏడు రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది. ప్రధాన నిందితుడు లలిత్‌ ఝాకు రాజస్థాన్‌లో సహకరించినట్లు భావిస్తోన్న మహేశ్‌ కుమావత్‌ను పోలీసులు దిల్లీ కోర్టు ముందు హాజరుపర్చారు. 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను నాశనం చేయడంలో మహేశ్‌ ప్రమేయం ఉందని వాదించారు. దేశంలో అరాచకం వ్యాప్తి చేయడానికి రూపొందించిన కుట్రలో భాగమయ్యాడని, దీంతో అతడిని విచారించాల్సి ఉందని తెలిపారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏడు రోజుల కస్టడీకే అనుమతించింది.

లోక్‌సభలో అలజడి వెనక కారణమదే: రాహుల్ గాంధీ విమర్శలు

ఈ కేసులో అరెస్టయినవారిలో మహేశ్‌ ఆరో వ్యక్తి. ఘటనానంతరం దిల్లీ నుంచి రాజస్థాన్‌కు పారిపోయిన లలిత్‌కు అతడు సహకరించినట్లు సమాచారం. నిందితుల ఫోన్‌లను తగలబెట్టి, సాక్ష్యాధారాలను నాశనం చేసే ప్రయత్నంలో భాగమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నేరపూరిత కుట్ర, సాక్ష్యాధారాలను నాశనం చేయడం వంటి ఆరోపణలపై అతడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. గురువారం రాత్రి లలిత్ ఝాతో కలిసి మహేశ్‌ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయినట్లు చెప్పారు. మొత్తంగా ఈ కేసులో దిల్లీ న్యాయస్థానం ఇప్పటివరకు ఆరుగురు నిందితుల (లలిత్‌, నీలం, సాగర్‌, అమోల్‌, మనోరంజన్‌, మహేశ్‌)కు ఏడు రోజుల చొప్పున పోలీస్‌ కస్టడీ విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని