Lalit Jha: పార్లమెంటులో అలజడి.. పోలీస్‌ కస్టడీకి ‘ప్రధాన సూత్రధారి’

పార్లమెంటులో అలజడి ఘటనకు సంబంధించి ‘ప్రధాన సూత్రధారి’ లలిత్‌ ఝాకు దిల్లీ న్యాయస్థానం ఏడు రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది.

Published : 15 Dec 2023 18:17 IST

దిల్లీ: పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటన (Parliament Security Breach Case)కు సంబంధించి కీలక నిందితుడిగా భావిస్తోన్న లలిత్‌ ఝాకు దిల్లీ కోర్టు ఏడు రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు అరెస్టు కాగా.. లలిత్‌ ఝా కూడా గురువారం రాత్రి పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ క్రమంలోనే పోలీసులు అతడిని దిల్లీ కోర్టు ముందు హాజరుపర్చారు. 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థించారు. లలిత్‌ ఝా ఈ కేసులో ‘ప్రధాన సూత్రధారి’ అని, మొత్తం కుట్రను వెలికితీసేందుకుగానూ అతడిని ప్రశ్నించాల్సి ఉందని వాదించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది.

‘ప్లాన్‌-బి’ రచించి.. ఆధారాలను తగలబెట్టి..!

ఈ కేసులో నిందితులపై పోలీసులు ఇప్పటికే చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (UAPA) కింద కేసులు నమోదు చేశారు. గురువారం నలుగురు నిందితులకు, నేడు లలిత్‌ ఝాకు కోర్టు ఏడు రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది. మరోవైపు.. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి స్పందించాలంటూ ప్రతిపక్ష ఎంపీలు తెలుపుతోన్న నిరసనలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ స్పందించారు. ‘పార్లమెంటు భవనాలు లోక్‌సభ స్పీకర్ పరిధిలోకి వస్తాయి. ఈ వ్యవహారంలో స్పీకర్ ఆదేశాల మేరకు నడచుకుంటున్నాం. ఈ కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తు సాగుతోంది. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని