Air India: మరో ఎయిరిండియా విమానం ఆలస్యం.. చెన్నై ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన 150 మంది

చెన్నై నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా (Air India) విమానం ఆలస్యమైంది. దీంతో కొన్ని గంటల నుంచి ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు.

Published : 26 Jun 2023 15:55 IST

చెన్నై: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) విమానాలు వరుసగా ఆలస్యమవుతుండటం విమర్శలకు దారితీస్తోంది. నిన్నటికి నిన్న జైపుర్‌లో అత్యవసరంగా దిగిన ఓ విమానం పైలట్‌ కారణంగా కొన్ని గంటల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా దిల్లీకి వెళ్లాల్సిన మరో విమానం (Chennai - Delhi Flight) ఆలస్యమైంది. దీంతో దాదాపు 150 మంది ప్రయాణికులు చెన్నై ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు.

షెడ్యూల్‌ ప్రకారం సోమవారం ఉదయం 10.05 గంటలకు చెన్నై (Chennai Airport) నుంచి ఎయిరిండియా విమానం దిల్లీ (Delhi Airport)కి బయల్దేరాల్సివుంది. అయితే ఈ విమానం ఆలస్యమవడంతో ఇప్పటికీ అందులో ఎక్కాల్సిన ప్రయాణికులు బోర్డింగ్‌ గేట్‌ వద్ద పడిగాపులు కాస్తున్నారు. దీంతో ఎయిరిండియా తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానం ఆలస్యానికి గల కారణాలపై ఎయిర్‌లైన్స్‌ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ప్రయాణికులు తెలిపారు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయట్లేదని ఆరోపిస్తున్నారు. అయితే, దీనిపై ఎయిరిండియా ఇంకా స్పందించలేదు.

ఇదీ చదవండి: విమానం అత్యవసర ల్యాండింగ్.. మళ్లీ టేకాఫ్‌ చేయనన్న పైలట్‌

ఆదివారం కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. లండన్‌ నుంచి బయల్దేరిన ఓ విమానానికి దిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో విమానాన్ని దారిమళ్లించి జైపుర్‌లో అత్యవసరంగా దించేశారు. అయితే ఆ తర్వాత విమానం గమ్యస్థానానికి ఏటీసీ అనుమతినిచ్చినా.. పైలట్‌ మాత్రం టేకాఫ్‌ చేసేందుకు నిరాకరించాడు. డ్యూటీ సమయం అయిపోయిందని, తాను విమానాన్ని నడపబోనని తెగేసి చెప్పాడు. దీంతో దాదాపు 8 గంటల పాటు విమానం అక్కడే నిలిచిపోయి దాదాపు 350 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చివరకు మరో పైలట్‌ను నియమించి వారిని దిల్లీకి పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని