Patanjali: సుప్రీం సీరియస్‌.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు

Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది.

Updated : 24 Apr 2024 15:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద (patanjali case) సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా (Ramdev Baba), ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ బుధవారం మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. వీరు ఇలా పేపర్లలో క్షమాపణ ప్రకటన ఇవ్వడం రెండు రోజుల్లో ఇది రెండోసారి. సైజు విషయంలో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో క్రితం రోజుతో పోలిస్తే మరింత పెద్ద పరిమాణంలో క్షమాపణల ప్రకటనలు ఇచ్చింది.

తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెబుతూ వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని పతంజలి గ్రూప్‌ నిన్న సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ కంపెనీ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ దేశవ్యాప్తంగా 67 పత్రికల్లో ఆ ప్రకటనలు ఇచ్చామని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘క్షమాపణలను ప్రముఖంగా ప్రచురించారా? గతంలో మీ ఉత్పత్తుల ప్రకటనలో ఉపయోగించిన ఫాంట్‌ సైజునే వాడారా? అంతే పరిమాణంలో క్షమాపణలను ప్రచురించారా?’ అని ప్రశ్నించారు. దీంతో బహిరంగ క్షమాపణలను పెద్ద సైజులో మరోసారి ప్రచురిస్తామని రోహత్గీ విన్నవించారు. ఈ నేపథ్యంలోనే నేడు మరోసారి వార్తాపత్రికల్లో క్షమాపణలు తెలియజేశారు.

ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు

ఈ కేసులో తదుపరి విచారణను ధర్మాసనం ఏప్రిల్‌ 30వ తేదీకి వాయిదా వేసింది.  పతంజలి కోర్టు ధిక్కార అంశాన్నీ అప్పుడే విచారిస్తామని పేర్కొంది. పత్రికల్లో వచ్చిన బహిరంగ క్షమాపణల ప్రకటనల వివరాలను రెండు రోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని, వాటి ప్రతులనూ పిటిషనర్లకు అందజేయాలని ఆదేశించింది.

ఆధునిక వైద్యవిధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి (Patanjali)పై ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ (IMA) సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబర్‌లో ఆ సంస్థను మందలించింది. దీంతో ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో సంస్థ తరఫున న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ, వాటిని ఉల్లంఘించడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఇప్పటికే రామ్‌దేవ్‌ బాబా, బాలకృష్ణ పలుమార్లు కోర్టుకు బేషరతు క్షమాపణలు చెప్పారు. కోర్టు వాటిని అంగీకరించకపోగా.. చర్యలకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. అలాగే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని