Patanjali: సుప్రీంకు పతంజలి క్షమాపణ

న్యాయవ్యవస్థ పట్ల తమకు అత్యంత గౌరవం ఉందని పతంజలి ఆయుర్వేద సంస్థ(Patanjali Ayurved).. సుప్రీంకోర్టుకు తెలిపింది.

Updated : 21 Mar 2024 15:43 IST

దిల్లీ: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద(Patanjali Ayurved) సంస్థ సుప్రీంకోర్టుకు క్షమాపణలు తెలియజేసింది. ధిక్కార పిటిషన్‌పై సమాధానం ఇవ్వకపోవడంతో రెండు రోజుల క్రితం అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన రామ్‌దేవ్‌ బాబా, మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా స్పందన వచ్చింది.

ఆధునిక వైద్యవిధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ (IMA) సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబర్‌లో ఆ సంస్థను మందలించింది. తమ ఉత్పత్తులు వివిధ రకాల వ్యాధులను నయం చేస్తాయంటూ ‘అసత్య’, ‘తప్పుదోవ’ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని సూచించింది. లేదంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపై ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో సంస్థ తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

ఓటర్ల వివేకాన్ని తక్కువగా అంచనా వేయొద్దు

అయితే, ఆ హామీని ఉల్లంఘించడంపై గత నెల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ రామ్‌దేవ్‌ బాబా(Yoga guru Ramdev)కు, ఆచార్య బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ప్రకటనల విషయంలోనూ సూచనలు చేసింది. ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపేలా ప్రింట్‌ లేదా ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల్లో ఎలాంటి ప్రచారం చేయవద్దని మరోసారి సూచించింది. ఆ నోటీసులకు పతంజలి సమాధానం ఇవ్వడంలో విఫలమైంది. ‘మీ ప్రతిస్పందన ఎందుకు దాఖలు చేయలేదు..?’ అని జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణ సమయంలో వారిద్దరు కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో పతంజలి సంస్థ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయవ్యవస్థ పట్ల అత్యంత గౌరవం ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆ తరహా ప్రకటనలు జారీ చేయకుండా చూసుకుంటామని చెప్పారు. ఈ ఉత్పత్తుల వాడకం ద్వారా ప్రజలు ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని గడపాలన్నదే తమ సంస్థ ఉద్దేశమని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని