Ashwini Vaishnaw: ఆ నంబర్ల నుంచి కాల్స్‌ వస్తే లిఫ్ట్‌ చేయొద్దు: టెలికాం మంత్రి

సైబర్‌ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కృషిచేస్తున్నామని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌కు ప్రజలెవరూ ఆన్సర్‌ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

Published : 03 Jun 2023 02:02 IST

దిల్లీ: సైబర్‌ మోసాలు (cyber frauds) పెరిగిపోతున్న వేళ కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. మొబైల్‌ ఫోన్‌లకు గుర్తు తెలియని (Unknown calls) నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను లిఫ్ట్‌ చేయొద్దని సూచించారు. కేంద్ర టెలికాం మంత్రిత్వశాఖ తీసుకున్న చర్యల ఫలితంగా స్పామ్‌ కాల్స్‌, సైబర్‌ మోసాలకు సంబంధించిన కేసులు గణనీయంగా తగ్గాయని మంత్రి వెల్లడించారు. శుక్రవారం దిల్లీలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.

స్పామ్‌కాల్స్‌, సైబర్‌ మోసాలపై వారు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. ‘‘తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను ఎప్పుడూ ఆన్సర్‌ చేయొద్దు. గుర్తించిన నంబర్ల నుంచి వచ్చిన కాల్స్‌కే రెస్పాండ్‌ కావాలని ప్రతి ఒక్క పౌరుడికీ విజ్ఞప్తి చేస్తున్నా’’ అని అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. గుర్తు తెలియని నంబర్‌ నుంచి మీకు సందేశం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎవరో నిర్ధారించుకున్నాకే స్పందించాలని మంత్రి సూచించారు. కేంద్ర టెలికాం మంత్రిత్వశాఖ ఇటీవల తీసుకొచ్చిన సంచార్‌ సాథి పోర్టల్‌ ద్వారా స్పామ్‌ కాల్స్‌, సైబర్‌ మోసాలను నిరోధించేందుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు. దాదాపు 40 లక్షలకు పైగా తప్పుడు సిమ్‌లు, 41 వేల అక్రమ ‘పాయింట్‌ ఆఫ్‌ సేల్‌’ ఏజెంట్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టినట్టు చెప్పారు. ఇలాంటి కేసులను గణనీయంగా తగ్గించడంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగపడుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని