Amit Shah: 370 సీట్లు పక్కా.. ఎన్నికలకు ముందే సీఏఏ: అమిత్‌ షా

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయని కేంద్రమంత్రి అమిత్‌ షా (Amit Shah) అన్నారు. సీఏఏను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు.

Updated : 10 Feb 2024 14:43 IST

దిల్లీ: ప్రధాని మోదీ (Modi) నాయకత్వంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందని భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ‘‘మన ముస్లిం సోదరుల్ని సీఏఏకి వ్యతిరేకంగా తప్పుదోవపట్టిస్తున్నారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లో హింసను ఎదుర్కొని భారత్‌కు వచ్చినవారికి పౌరసత్వం ఇవ్వడమే సీఏఏ ఉద్దేశం. ఏ ఒక్కరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడం కోసం కాదు’’ అని స్పష్టం చేశారు. సీఏఏ అమలుకు ముందు దానికి సంబంధించిన నిబంధనలను జారీ చేస్తామన్నారు.

ఇక, లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 సీట్లు గెలుచుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘మే ఆర్టికల్‌ 370 (Article 370)ని రద్దు చేశాం. అందుకే దేశ ప్రజలు భాజపాకు 370 సీట్లు.. మొత్తంగా ఎన్డీయేకు 400 సీట్లు ఇచ్చి ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను’’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. దిల్లీలో గ్లోబల్‌ బిజినెస్ సమ్మిట్‌ 2024లో ఈ మేరకు మాట్లాడారు. రాష్ట్రీయ లోక్‌దళ్‌ (RLD), శిరోమణి అకాలీదళ్‌ (SAD) వంటి ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేలో చేరతాయా? అని ప్రశ్నించగా.. ‘మేం ఫ్యామిలీ ప్లానింగ్‌ను నమ్ముతాం కానీ రాజకీయాల్లో కాదు’ అని సమాధానమిచ్చారు. మరిన్ని పార్టీలు ఎన్డీయేలో చేరతాయని పరోక్షంగా వెల్లడించారు. 

మూడో దఫా ప్రభుత్వంలో ఇంతకుమించి భారీ నిర్ణయాలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర గురించి కూడా అమిత్‌ షా స్పందించారు. 1947లో దేశ విభజనకు కారణమైన ఆ పార్టీ నేతకు ఈ తరహా యాత్రతో ముందుకు వెళ్లే అర్హత లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం గురించి మాట్లాడుతూ.. ‘2014లో భారత ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకుల్లో ఉంది. అంతటా కుంభకోణాలే. విదేశీ పెట్టుబడులు రావడం లేదు. అప్పుడే శ్వేతపత్రం తెచ్చి ఉంటే.. ప్రపంచానికి తప్పుడు సందేశం వెళ్లేది. ఈ పదేళ్లలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాం. అవినీతి లేదు. విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చాయి. అందుకే ఈ పత్రాన్ని తీసుకురావడానికి ఇదే సరైన తరుణం’ అని తెలిపారు. రాముడు జన్మించిన ప్రాంతంలో రామమందిరాన్ని నిర్మిస్తారని దేశ ప్రజలు 500 ఏళ్లపాటు నమ్మారని, బుజ్జగింపు రాజకీయాల కారణంగా ఆ కల ఆలస్యమైందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని