Pratap Simha: పార్లమెంట్ ఘటనపై తొలిసారి స్పందించిన ప్రతాప్‌ సింహా

పార్లమెంట్‌లో అలజడి సృష్టించిన నిందితులకు పాసులు జారీ చేసిన భాజపా ఎంపీ ప్రతాప్‌ సింహా తొలిసారి  ఘటనపై స్పందించారు. 

Published : 24 Dec 2023 16:57 IST

మైసూరు: ·రెండు వారాల క్రితం పార్లమెంట్‌ (Parliament Security Breach)లోకి చొరబడిన ఇద్దరు ఆగంతకులకు పాసులు జారీ చేసిన లోక్‌సభ సభ్యుడు, మైసూరు (Mysuru) ఎంపీ ప్రతాప్‌ సింహా (Pratap Simha ) ఈ ఘటనపై తొలిసారి స్పందించారు. తాను దేశభక్తుడినా లేక  దేశద్రోహినా అనేది 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. ఆదివారం మైసూరులో మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలపై నిర్ణయాధికారం దేవుడికి, తన రచనలు చదివే పాఠకులకు విడిచిపెడుతున్నట్లు తెలిపారు. 

‘‘ప్రతాప్‌ సింహా దేశద్రోహా, దేశభక్తుడా అనేది మైసూరు కొండల్లో వెలసిన చాముండేశ్వరీ మాతకు, బ్రహ్మగిరిలో వెలసిన కావేరి మాతకు, గత 20 ఏళ్లుగా కన్నడనాట నా రచనలు చదివే పాఠకులకు,  మైసూరు ప్రజలకు తెలుసు. జాతీయవాదం విషయంలో నా ప్రవర్తనపై 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పునిస్తారు. ఈ విషయంలో ఇంతకు మించి నేను ఏం చెప్పాలనుకోవట్లేదు’’ అని అన్నారు. మరోవైపు ఈ కేసులో భాజపా ఎంపీ ప్రతాప్‌ సింహా వాదనను పోలీసులు రికార్డు చేశారని పార్లమెంట్‌ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి శుక్రవారం వెల్లడించారు. 

ప్రసంగిస్తూ వేదికపైనే కన్నుమూసిన ఐఐటీ ప్రొఫెసర్‌

డిసెంబరు 13న ఇద్దరు ఆగంతకులు లోక్‌సభ గ్యాలరీ నుంచి వెల్‌లోకి దూకి పొగ బాంబులను విడుదల చేశారు. ఆ ఇద్దరు భాజపా ఎంపీ ప్రతాప్ సింహా పేరుతో జారీ చేసిన పాసులతోనే సభలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. దీంతో ఆయన్ను విచారించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో దాడి జరిగిన రోజే ఆయన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి తన వాదనను వినిపించారు. దర్యాప్తు బృందానికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో పార్లమెంటులోకి ప్రవేశించిన మనోరంజన్‌ డి, సాగర్‌ శర్మలతోపాటు వెలుపల అలజడి సృష్టించేందుకు ప్రయత్నించిన అమోల్‌ ధన్‌రాజ్‌ శిందే, నీలమ్‌దేవిలను పటియాలా హౌస్‌ కోర్టు జనవరి 5 వరకు పోలీసుల కస్టడీ విధించింది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న లలిత్‌ ఝా ధ్వంసం చేసిన ఆధారాలను పోలీసులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని