IIT Kanpur: ప్రసంగిస్తూ వేదికపైనే కన్నుమూసిన ఐఐటీ ప్రొఫెసర్‌

పూర్వ విద్యార్థుల సమావేశంలో మాట్లాడుతున్న ఓ ప్రొఫెసర్‌ వేదికపైనే కన్నుమూసిన ఘటన ఐఐటీ కాన్పూర్‌ ఆడిటోరియంలో చోటు చేసుకొంది.  

Updated : 24 Dec 2023 10:30 IST

కాన్పూర్‌: ఐఐటీ కాన్పూర్‌ (IIT Kanpur)లో విషాదకర ఘటన చోటు చేసుకొంది. ఓ సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఓ ప్రొఫెసర్‌ గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకోగా.. సంస్థ అధికారులు శనివారం వెల్లడించారు. సమీర్‌ ఖండేకర్‌ (Sameer Khandekar)(53) ఐఐటీ కాన్పూర్‌లో సీనియర్‌ ప్రొఫెసర్‌. ఆయన విద్యార్థి వ్యవహారాల విభాగం డీన్‌గా, మెకానికల్‌ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సమావేశంలో సమీర్‌ పాల్గొన్నారు. ఆయన వేదికపై ప్రసంగిస్తుండగా.. ఒక్కసారిగా ఛాతిలో నొప్పి మొదలైంది. ఒళ్లంతా చెమటలు పట్టి అస్వస్థతకు గురయ్యారు. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపు నిలుచున్న చోటే కూప్పకూలిపోయారు. దీంతో అక్కడున్న వారంతా షాక్‌కి గురయ్యారు.

వీధికుక్కలు, పిల్లుల కోసం ఇద్దరు మిత్రుల భిక్షాటన

సమీర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతి పట్ల సహ ప్రొఫెసర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం మృతదేహాన్ని ఐఐటీ కాన్పూర్‌లోని ఆరోగ్య కేంద్రంలో భద్రపర్చినట్లు అధికారులు తెలిపారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో చదువుతున్న ఆయన కుమారుడు ప్రవాహ్‌ ఖండేకర్‌ వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. ఐదేళ్లుగా సమీర్‌ అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని