Vaishno Devi shrine: వైష్ణోదేవి క్షేత్రానికి పోటెత్తిన యాత్రికులు.. పదేళ్లలో ఇదే రికార్డు!

జమ్మూలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయానికి పదేళ్లతో పోలిస్తే రికార్డు స్థాయిలో యాత్రికులు పోటెత్తారు. 

Published : 26 Dec 2023 20:54 IST

జమ్మూ: జమ్మూలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రదేశం  శ్రీ మాతా వైష్ణోదేవి (Vaishno Devi shrine) ఆలయానికి ఈ ఏడాది భారీగా యాత్రికులు పోటెత్తారు. సోమవారం వరకు రికార్డు స్థాయిలో 93.50లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క ఏడాదిలో ఇంత భారీగా యాత్రికులు సందర్శించడం గత పదేళ్లలో ఇదే తొలిసారి అని తెలిపారు.  వైష్ణోదేవి క్షేత్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..  జమ్మూలోని రియాసి జిల్లాలో త్రికూట కొండల్లోని అమ్మవారి ఆలయాన్ని డిసెంబర్‌ 25వరకు 93.50లక్షల మంది భక్తులు సందర్శించినట్లు వెల్లడించారు.  2013లో 93.23లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా.. ఆ తర్వాత  పదేళ్లలో ఇప్పుడు మళ్లీ  అంత భారీగా యాత్రికులు తరలివచ్చారని వైష్ణోదేవి క్షేత్రం బోర్డు సీఈవో అన్షుల్‌ గార్గ్‌ తెలిపారు. అంతకుముందు 2012లో అత్యధికంగా 1,04,09,569మంది యాత్రికులు రాగా..  2011లో 1,01,15,647 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. 

‘సముద్రంలో ఎక్కడ దాక్కున్నా.. వారిని వేటాడతాం!’

ప్రస్తుతం రోజూ 37వేల నుంచి 44 వేల మంది భక్తులు పుణ్యక్షేత్రానికి వస్తున్నారని గార్గ్‌ తెలిపారు. ఈ ఏడాది అమ్మవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తుల సంఖ్య 95 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు, మాతా వైష్ణో దేవి భవన్, దుర్గా భవన్‌లో స్కైవాక్‌తో పాటు ఇటీవలి కాలంలో కొన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. స్కైవాక్‌, ఆధునీకరించిన పార్వతి భవన్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అక్టోబర్‌లో ప్రారంభించారు. అంతేకాకుండా, కాట్రాలోని ఈ పుణ్యక్షేత్రంలో 24గంటల పాటు పనిచేసే అత్యాధునిక కాల్‌ సెంటర్‌ కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా యాత్రికుల నుంచి రోజూ దాదాపు 2500 కాల్స్‌ వస్తుంటాయని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని