Hacking Row: విపక్ష ఎంపీలను ఎవరో ఆట పట్టించారనుకుంటా..: హ్యాకింగ్ వివాదంపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు

Hacking Row: విపక్ష పార్టీలు ప్రస్తుతం బలహీన దశలో ఉన్నాయని, అందుకే వాటికి ప్రతిదీ కుట్రలాగే కనిపిస్తోందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌(Piyush Goyal) విమర్శించారు. హ్యాకింగ్ వివాదం గురించి మీడియాతో  మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు. 

Updated : 01 Nov 2023 11:02 IST

దిల్లీ: తమ యాపిల్‌ ఫోన్లలో హ్యాకింగ్‌ యత్నాలకు సంబంధించిన అలర్ట్‌లు వచ్చాయంటూ విపక్షనేతలు చేసిన ఆరోపణలు కలకలం సృష్టించాయి. ఈ ఆరోపణలను కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌(Piyush Goyal) తోసిపుచ్చారు. విపక్ష నేతలను ఎవరో సరదాగా ఆటపట్టించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. (Hacking Row)

‘విపక్ష నేతలపై ఎవరో  ప్రాంక్‌(ఆటపట్టించి) చేసి ఉండొచ్చని నేను అనుకుంటున్నా. దానిపై వారు ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది’ అని మీడియా అడిగిన ప్రశ్నకు గోయల్‌(Piyush Goyal) సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ‘ప్రస్తుతం విపక్ష పార్టీలు బలహీనదశలో ఉన్నాయని భావిస్తున్నాను. అందుకే ఆ పార్టీల నేతలు ప్రతిదాంట్లో కుట్రకోణాన్ని చూస్తున్నారు. ఇది ఒక లోపం వల్ల జరిగి ఉండొచ్చని, 150 దేశాల్లోని ప్రజలకు ఈ సందేశం వచ్చిందని యాపిల్‌ సంస్థే స్వయంగా వెల్లడించింది. దీనినిబట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా హ్యాకర్లు చురుగ్గా ఉన్నారని కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతాం’ అని వెల్లడించారు.

యాపిల్‌ ఫోన్ల హ్యాకింగ్‌?

అలాగే విపక్ష నేతలు ఏదనుకుంటే అది చెప్పొచ్చని, అయితే వారి పరిస్థితి ఏంటో దేశం మొత్తానికి తెలుసని గోయల్‌ ఎద్దేవా చేశారు. వారు ప్రస్తుతం అంతర్గత పోరులో చిక్కుకుపోయి ఉన్నారని విమర్శించారు. వారు ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు వారి బలహీనతలను సమీక్షించుకోవాలని చురకలు అంటించారు. ప్రస్తుత వ్యవహారంలో ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. తమ ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తుల ద్వారా ప్రయత్నం జరిగినట్లు అలర్ట్‌ సందేశాలు వచ్చినట్లు నిన్న విపక్ష ఎంపీలు మహువా మొయిత్రా, ప్రియాంక చతుర్వేది, రాఘవ్‌ చడ్డా, అసదుద్దీన్‌ ఓవైసీ, శశిథరూర్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌కు ఈ అలర్ట్ వచ్చినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు