యాపిల్‌ ఫోన్ల హ్యాకింగ్‌?

తమ యాపిల్‌ ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తుల ద్వారా ప్రయత్నం జరిగినట్లు అప్రమత్తత సందేశాలు వచ్చాయంటూ విపక్ష ఎంపీలు చేసిన ఆరోపణలు దేశంలో కలకలం రేకెత్తించాయి.

Updated : 01 Nov 2023 09:44 IST

అప్రమత్తత సందేశాలు వచ్చాయన్న విపక్ష ఎంపీలు
150 దేశాలకు ఇలాంటివి వెళ్లాయన్న కేంద్ర మంత్రి వైష్ణవ్‌
సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వ ఆదేశం
అదానీని ప్రశ్నించినందుకే ఇదంతా చేస్తున్నారు: రాహుల్‌

దిల్లీ, ఈనాడు-దిల్లీ: తమ యాపిల్‌ ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తుల ద్వారా ప్రయత్నం జరిగినట్లు అప్రమత్తత సందేశాలు వచ్చాయంటూ విపక్ష ఎంపీలు చేసిన ఆరోపణలు దేశంలో కలకలం రేకెత్తించాయి. సుదూర ప్రాంతాల నుంచి ఫోన్లలో చొరబడి, సమాచారాన్ని తస్కరించే ప్రయత్నం జరుగుతోందని ఈ హెచ్చరికల్లో ఉన్నట్లు మహువా మొయిత్రా (తృణమూల్‌), ప్రియాంక చతుర్వేది (శివసేన-యూబీటీ), శశిథరూర్‌ (కాంగ్రెస్‌), రాఘవ్‌ చడ్డా (ఆప్‌), అసదుద్దీన్‌ ఒవైసీ (ఏఐఎంఐఎం) వంటి పలువురు ఎంపీలు ఆందోళన వ్యక్తంచేశారు. సందేశాల స్క్రీన్‌షాట్లను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. హోదా, లేదా తమ చర్యల వల్ల హ్యాకర్లు వ్యక్తిగతంగా వారిని ఎంపిక చేసుకున్నట్లు ఈ సందేశాల్లో ఉంది. హ్యాకింగ్‌ జరిగితే డేటా, కెమెరా, మైక్రోఫోన్‌ సహా అంతా ఎక్కడో దూరాన ఉన్నవారి చేతికి చిక్కుతుందని తెలిపింది. ఇది తప్పుడు హెచ్చరిక కూడా కావొచ్చని చెబుతూనే ఈ హెచ్చరికను సీరియస్‌గా తీసుకోవాలని యాపిల్‌ తెలిపినట్లు శశిథరూర్‌ ‘ఎక్స్‌’లో వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా ఇలాంటిది వచ్చినట్లు తెలుస్తోంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌లకూ ఇదే సందేశం వచ్చింది. పారిశ్రామికవేత్త గౌతం అదానీకి ప్రభుత్వం అనుచితంగా కల్పిస్తున్న లబ్ధి గురించి ప్రశ్నిస్తున్నందుకే కేంద్ర సర్కారు ఉద్దేశపూర్వకంగా విపక్ష నేతల ఫోన్లలోకి చొరబడే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు.

సీరియస్‌గా తీసుకుంటున్నాం: వైష్ణవ్‌

గోప్యత, డేటాను కాపాడడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టంచేశారు. హ్యాకింగ్‌ జరిగినట్లు వ్యక్తమైన అనుమానాలపై నిగ్గు తేల్చేందుకు ‘కంప్యూటర్‌ అత్యవసర స్పందన బృందం’ (సీఈఆర్‌టీ) ద్వారా సమగ్ర సాంకేతిక విచారణ జరుపుతామని ప్రకటించారు. యాపిల్‌ ఇలాంటి సందేశాలను 150 దేశాలకు ఇచ్చిందని చెప్పారు. వినియోగదారుల అనుమతి లేనిదే ఏమాత్రం ఫోన్లలోకి చొరబడడం సాధ్యంకాని రీతిలో ఐడీలను నిగూఢపరిచినట్లు యాపిల్‌ స్పష్టం చేసిందన్నారు. యాపిల్‌ పరికరాలు భద్రమైనవైతే 150 దేశాల ప్రజలకు నోటిఫికేషన్లు ఎందుకు వచ్చాయో ఆ సంస్థ స్పష్టతనివ్వాలని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు.

ఒక్కోసారి నకిలీ హెచ్చరికలు వస్తుంటాయి: యాపిల్‌

ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ ఈ ఆరోపణలపై స్పందించింది. నోటిఫికేషన్లను ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులకు ఆపాదించలేమంది. ‘యాపిల్‌ ఫోన్లకు వచ్చే కొన్ని అలర్ట్‌ నోటిఫికేషన్లు నకిలీ హెచ్చరికలు అయిఉండొచ్చు. కొన్ని దాడులను గుర్తించలేం కూడా. నోటిఫికేషన్‌ జారీకి కారణాలను వెల్లడించలేం. దానిని బయటపెడితే హ్యాకర్లు భవిష్యత్తులో మా నిఘా నుంచి తప్పించుకునే అవకాశముంది’ అని తెలిపింది. సంప్రదాయ సైబర్‌ నేరగాళ్లతో పోలిస్తే ప్రభుత్వ సహకారంతో దాడులు చేసేవారు అసాధారణ వనరుల్ని వినియోగిస్తారని, వారిని గుర్తించి కళ్లెం వేయడం కష్టమని పేర్కొంది. ఈ-మెయిల్‌ అటాచ్‌మెంట్లు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా లింకులు పంపి హ్యాక్‌ చేస్తారని, అలాంటివి తెరవవద్దని హెచ్చరించింది. ప్రాయోజిత దాడులు అధునాతనంగా ఉంటాయని, వాటికి బాగా నిధులు లభిస్తుంటాయని పేర్కొంది.

ప్రధాని ప్రాణం ఆ చిలుకలో ఉంది: కాంగ్రెస్‌

ప్రధాని మోదీ ప్రాణం అదానీ అనే చిలుకలో ఉందని, అదానీని ప్రశ్నిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష ఎంపీల ఫోన్లలోకి చొరబడుతోందని రాహుల్‌ గాంధీ దిల్లీలో విలేకరుల సమావేశంలో ఆరోపించారు. అదానీపై ఎవరు విమర్శలు గుప్పించినా వెంటనే నిఘావర్గాలు, ఈడీ, సీబీఐల దాడి మొదలవుతోందని పేర్కొన్నారు. ప్రధాని మొదటి స్థానంలో, అదానీ రెండో స్థానంలో, అమిత్‌షా మూడో స్థానంలో ఉంటారని ఇదివరకు తాను అనుకునేవాడినని, కానీ అదానీ తర్వాతి స్థానాల్లో మిగతా ఇద్దరు ఉన్నట్లు రూఢీ అయిందన్నారు. మన్మోహన్‌సింగ్‌, వాజ్‌పేయీ వంటి నేతల సర్కార్ల హయాంలో ఇలాంటివి జరిగిఉంటే ప్రభుత్వాలు కూలిపోయేవన్నారు. దేశంలో మౌలిక వసతులన్నింటినీ అదానీకే అప్పగించారని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా పోరాడడంలో ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమన్నారు. కావాలంటే తన ఫోన్‌ ఇస్తానని, ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టంచేశారు. ఈస్టిండియా కంపెనీ తరహా గుత్తాధిపత్యంలో మన దేశం ఉందని చెప్పారు. అదానీపై వ్యక్తిగతంగా తనకు వ్యతిరేకత లేదనీ, ఆయన గుత్తాధిపత్య ధోరణిపైనే పోరాడుతున్నానని అన్నారు.


నా ఫోన్‌కూ హ్యాక్‌ సందేశం వచ్చింది: మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తనకు ఫోన్‌కు కూడా హ్యాక్‌ అయినట్లుసందేశం వచ్చిందని మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్‌ చేసేందుకు భాజపా ఎంతకైనా దిగజారుతుందని ఆయన ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని