Parliament Security Breach: లోక్‌సభలో అలజడి ఘటన.. రెక్కీ చేసింది అతడే..!

Parliament Security Breach: లోక్‌సభలో భద్రతా వైఫల్యం ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులపై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Updated : 14 Dec 2023 13:26 IST

దిల్లీ: ప్రజాస్వామ్య దేవాలయంగా పిలిచే పార్లమెంట్‌ (Parliament)లో బుధవారం దుండగులు సృష్టించిన అలజడి యావత్‌ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ ఘటనపై దిల్లీ పోలీసులు (Delhi Police) ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణలో నిందితుల గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లోక్‌సభలో పట్టుబడిన మనోరంజన్‌ అనే వ్యక్తే ఈ ఘటన మొత్తానికి కీలకమని పోలీసు వర్గాలు గురువారం వెల్లడించాయి. (Security Breach In Lok Sabha)

మనోరంజన్‌, సాగర్‌ శర్మ, నీలమ్‌, అమోల్‌ శిందె, విశాల్‌, లలిత్‌ అనే ఆరుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో మనోరంజన్‌, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడగా.. నీలమ్‌, అమోల్‌ శిందే పార్లమెంట్‌ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి సహకరించిన విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా లలిత్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

మూడంచెల భద్రత కళ్లుగప్పి.. పార్లమెంటులోకి గ్యాస్‌ క్యాన్లను తెచ్చిన దుండగులు

రెక్కీ చేసింది మనోరంజనే..

ఈ ఘటన మొత్తానికి మాస్టర్‌ మైండ్‌ మనోరంజనే అని పోలీసు వర్గాలు తాజాగా వెల్లడించాయి. కర్ణాటకలోని మైసూరుకు చెందిన మనోరంజన్‌.. ఒక ఎంపీ నుంచి పార్లమెంటులో ప్రవేశానికి పాస్‌ తీసుకున్నాడు. సాగర్‌ శర్మను తన స్నేహితుడిగా పేర్కొంటూ అతడికీ పాస్‌ ఇప్పించాడు. అతడి పిలుపుతోనే మిగతా వారు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఏడాది జరిగిన వర్షాకాల సమావేశాల సమయంలో మనోరంజన్‌ పార్లమెంట్ వద్ద రెక్కీ నిర్వహించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. పార్లమెంట్‌లో సిబ్బంది బూట్లను తనిఖీ చేయడంలేదనే విషయాన్ని అప్పుడే అతడు గుర్తించాడు. మనోరంజన్‌ తీరు నక్సల్స్‌ భావజాలంతో పోలి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు అతడే ప్రధాన కుట్రదారు కావచ్చేమో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

వీడియో తీసి.. షేర్‌ చేసి..

ఈ ఘటన సమయంలో లలిత్‌ కూడా పార్లమెంట్‌ ప్రాంగణంలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్లమెంట్ సమీపంలో నీలమ్‌, అమోల్‌ ఆందోళన చేస్తుండగా ఆ వీడియోను లలిత్‌ ఫోన్లో రికార్డ్‌ చేసినట్లు తెలిసింది. భద్రతా సిబ్బంది వారిని పట్టుకోగానే.. నిందితులదరి ఫోన్లతో లలిత్‌ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం ఆ వీడియోను పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ ఎన్జీవో సభ్యురాలికి పంపినట్లు సమాచారం. సదరు ఎన్జీవో సభ్యురాలు ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గతంలో లలిత్‌ మా ఎన్జీవోతో కలిసి పనిచేశాడు. పార్లమెంట్‌ వద్ద ఆందోళనకు సంబంధించి నాకు వాట్సప్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు. దాన్ని వైరల్‌ చేయమని మెసేజ్‌ చేశాడు’’ అని ఆమె వెల్లడించారు.

‘ఉపా’ చట్టం కింద కేసు..

ఈ ఘటనలో నిందితులపై పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేశారు. వీరిని గురువారం పాటియాలా హౌస్‌ కోర్టులో హాజరుపర్చనున్నారు. గరిష్ఠంగా 30 రోజుల కస్టడీని కోరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని