PM Modi: కేంద్ర మంత్రిమండలి భేటీ.. ‘వికసిత్‌ భారత్‌’పై సమాలోచనలు!

‘‘వికసిత్‌ భారత్- 2047’’ విజన్‌ డాక్యుమెంట్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర మంత్రిమండలి ఆదివారం సమాలోచనలు జరిపింది.

Updated : 03 Mar 2024 21:00 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) సమయంలో.. ప్రజల ఆదరణ చూరగొనేందుకు అన్ని విధాలా కృషి చేయాలని తన మంత్రివర్గ సహచరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సూచించారు. ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్ర మంత్రిమండలి ఆదివారం దిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా ‘‘వికసిత్‌ భారత్- 2047 (Viksit Bharat)’’ విజన్‌ డాక్యుమెంట్‌తోపాటు రాబోయే ఐదేళ్ల కోసం వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికపై మేధోమథనం జరిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకోవాల్సిన తక్షణ చర్యల కోసం 100 రోజుల అజెండాపైనా చర్చించినట్లు తెలిపాయి.

10 రోజులు.. 12 రాష్ట్రాలు.. మోదీ సుడిగాలి పర్యటన ఇలా!

‘‘వికసిత్‌ భారత్ రోడ్‌మ్యాప్‌ రూపకల్పనకు కేంద్రం రెండేళ్లకుపైగా తీవ్ర కసరత్తు చేసింది. అన్ని మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, పౌర సమాజం, శాస్త్రసాంకేతిక సంస్థలు, యువతతో విస్తృత సంప్రదింపులు జరిపింది. మొత్తం ప్రభుత్వం ఈ ప్రక్రియలో నిమగ్నమైంది’’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీని కోసం 2,700కు పైగా సమావేశాలు, కార్యశాలలు, సెమినార్‌లు నిర్వహించామని.. యువత నుంచి 20 లక్షలకుపైగా సూచనలు స్వీకరించామని ఓ అధికారి వెల్లడించారు.

‘వికసిత్‌ భారత్‌’లో ఏముంది..?

‘వికసిత్‌ భారత్-2047’ రోడ్‌మ్యాప్‌లో జాతీయ విధానాలు, ఆకాంక్షలు, లక్ష్యాలు, ఈ దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ గురించి సమగ్రంగా పొందుపర్చారు. ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం, సులభతర వ్యాపారం, జీవనం వంటివాటిలో భారత్‌ తన లక్ష్యాలను నిర్దేశించుకుంది. సమావేశంలో వివిధ మంత్రిత్వ శాఖలూ తమ ఆలోచనలను పంచుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. త్వరలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో మోదీ సర్కారుకు ఇది తుది మంత్రిమండలి భేటీగా భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని