PM Modi: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్‌.. ‘సూర్య ఘర్‌’ను ప్రారంభించిన మోదీ

PM Surya Ghar: Muft Bijli Yojana: దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు వీలుగా సరికొత్త పథకాన్ని ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Published : 13 Feb 2024 14:48 IST

దిల్లీ: సౌర విద్యుత్‌ (solar power) వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్య పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా ఈసారి బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దాని అమలుదిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.  కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana)’ పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) స్వయంగా ప్రకటన చేశారు. ఇందుకోసం సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

‘‘మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రూ.75 వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్ట్‌తో.. ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీని కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీపై రుణాలు పొందొచ్చు. ప్రజలపై ఎలాంటి వ్యయభారం ఉండదని హామీ ఇస్తున్నాం’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్‌ (ట్విటర్‌)’లో వెల్లడించారు.

క్షేత్రస్థాయిలో ఈ పథకానికి ప్రచారం తీసుకొచ్చేందుకు.. పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రధాని తెలిపారు. వారు తమ పరిధిలో ఈ రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థను ప్రోత్సహించాలని సూచించారు. ఈ పథకంతో విద్యుత్‌ బిల్లులు తక్కువ రావడంతో పాటు ఉపాధి కల్పన జరుగుతుందని తెలిపారు.

‘‘సౌరశక్తిని, స్థిరమైన అభివృద్ధిని మరింత విస్తృతం చేద్దాం. గృహ వినియోగదారులు, ముఖ్యంగా యువత ఈ ‘సూర్య ఘర్‌’ పథకాన్ని బలోపేతం చేయాలని కోరుతున్నా. ఇందుకోసం pmsuryaghar.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు’’ అని మోదీ వెల్లడించారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని