LS Polls: రిజర్వేషన్లకు ప్రధాని మోదీనే అతిపెద్ద మద్దతుదారు: అమిత్‌ షా

రిజర్వేషన్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే అతిపెద్ద మద్దతుదారు అని కేంద్ర మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.

Published : 13 Apr 2024 22:15 IST

జైపుర్: రిజర్వేషన్లను భాజపా (BJP) రద్దు చేయదని, ఎవరినీ ఆ దిశగా అనుమతించదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) తెలిపారు. రిజర్వేషన్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే అతిపెద్ద మద్దతుదారు అని పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలవారి కోటాను తొలగించాలని భాజపా ప్రభుత్వం యత్నిస్తోందంటూ కాంగ్రెస్‌ (Congress) అపోహలు వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచార సభలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు.

‘‘కాంగ్రెస్‌.. ఓబీసీ వ్యతిరేకి. వెనుకబడిన వర్గాలకు ఆ పార్టీనే అన్యాయం చేసింది. రిజర్వేషన్లకు సంబంధించిన కాకా కాలేల్కర్‌ నివేదికను తొక్కిపెట్టింది. మండల్‌ కమిషన్‌ రిపోర్ట్‌ను అటకెక్కించింది. కానీ, రిజర్వేషన్లకు భాజపా మద్దతు ఇస్తుంది. మోదీ అధికారంలోకి వచ్చాక ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించేందుకు కృషి చేశారు. కేంద్రంలోని అన్ని నియామకాల్లో ఓబీసీ వర్గాలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ప్రధాని మోదీతోపాటు 27 మంది కేంద్ర మంత్రులు ఓబీసీలే’’ అని అమిత్‌ షా తెలిపారు.

400 కాదు.. 200 సీట్లు దాటి చూపించండి: భాజపాపై మమత వ్యాఖ్యలు

తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మరింత కోటా దక్కేలా.. వారి రిజర్వేషన్లపై ఇప్పుడున్న 50 శాతం పరిమితిని పెంచుతామని కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో పొందుపర్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నడుమ అమిత్‌ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సోనియా గాంధీ దృష్టి అంతా రాహుల్‌ గాంధీని ప్రధాని చేయడంపైనే ఉంది తప్ప.. ప్రజలపై లేదని షా విమర్శించారు. ఇదిలా ఉండగా.. 25 ఎంపీ స్థానాలున్న రాజస్థాన్‌లో లోక్‌సభ ఎన్నికలు రెండు విడత (ఏప్రిల్‌ 19, 26)ల్లో నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని