PM Modi: జూన్ 18న వారణాసికి ప్రధాని మోదీ..రైతులతో సమావేశం

ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈనెల 18న తొలి సారిగా తన నియోజకవర్గం వారణాసికి వెళ్లనున్నారు.

Published : 11 Jun 2024 12:21 IST

లఖ్‌నవూ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) జూన్ 18న ఉత్తరప్రదేశ్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసి (Varanasi)కి వెళ్లనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అక్కడ ఆయన  ‘కిసాన్ సమ్మేళన్’ (రైతుల సదస్సు)లో పాల్గొనే అవకాశం ఉందని తెలిపాయి. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీ వారణాసికి వెళ్లడం ఇదే తొలిసారి.

వారణాసిలోని రోహానియా లేదా సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గంలో రైతుల సదస్సు(farmers' conference) నిర్వహించే అవకాశం ఉన్నట్లు స్థానిక భాజపా నేతలు తెలిపారు. వేదిక ఏర్పాటుకు స్థలం ఎంపిక జరుగుతోందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ వారణాసి పర్యటనకు సంబంధించి ఏర్పాట్ల కోసం గులాబ్ బాగ్‌లోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధికారుల సమావేశం జరిగిందన్నారు.

కాశీ ప్రాంతానికి భాజపా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న దిలీప్ పటేల్ మాట్లాడుతూ టెంపుల్ టౌన్‌లో ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దశాశ్వమేధ ఘాట్‌లో గంగా హారతిలో పాల్గొంటారని తెలిపారు. అందుకు తగిన సన్నాహాలు ప్రారంభించామన్నారు. వారణాసిలో ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధం కావాలని భాజపా(BJP) కార్యకర్తలను కోరామన్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ వరుసగా మూడోసారి వారణాసి స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్‌(Congress) నేత అజయ్ రాయ్‌(Ajay Rai)ను 1.5 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆదివారం సాయంత్రం మోదీ మూడోసారి దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని