Modi: రైతుల నిరసనల వేళ.. మోదీ పోస్టు

తమ డిమాండ్ల పరిష్కారం దిల్లీ చలో పేరిట రైతుల నిరసనలు(Farmers Protest) తలపెట్టిన వేళ.. మంత్రి వర్గ నిర్ణయంతో వారికి లబ్ధి చేకూరుతుందని ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు. 

Updated : 22 Feb 2024 11:39 IST

దిల్లీ: రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ(Modi) పునరుద్ఘాటించారు. కేంద్రం చెరకు పంటకు గిట్టుబాటు ధర(Sugarcane support price)ను పెంచిన నేపథ్యంలో గురువారం ఆయన ఎక్స్‌(ట్విటర్) వేదికగా స్పందించారు. ‘దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు సంబంధించి ప్రతి డిమాండ్‌ను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలోనే చరిత్రాత్మక నిర్ణయం వెలువడింది. చెరకు కొనుగోలు ధర పెంపునకు ఆమోదం లభించింది. దీంతో కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది’ అని మోదీ పోస్టు చేశారు.

బుధవారం రాత్రి ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ చెరకు గిట్టుబాటు ధరను పెంచింది. గతంతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.25 పెంచింది.దీంతో మద్దతు ధర రూ.340కు చేరింది. 2023-24తో పోలిస్తే ఇది 8శాతం అధికం. ఈ సవరించిన ధర 2024 అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తుంది.

వారు మన అన్నదాతలు.. చర్చలకు ఎప్పుడూ సిద్ధమే: అనురాగ్‌ ఠాకుర్‌

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా పలు డిమాండ్లతో ‘దిల్లీ చలో’ ఆందోళనను తలపెట్టిన అన్నదాతలు ఈ నెల 13 నుంచి పంజాబ్‌-హరియాణా రాష్ట్రాల సరిహద్దుల్లోని శంభు, ఖనౌరీల వద్ద వేల సంఖ్యలో గుమిగూడి ఉన్న సంగతి తెలిసిందే. వారు నిన్న దిల్లీ దిశగా తమ నిరసనను (Farmers Protest) ఉద్ధృతం చేసేందుకు యత్నించారు. ఇప్పటికే నాలుగు దఫాలుగా కేంద్రం, రైతుల సంఘాల మధ్య చర్చలు జరిగినప్పటికీ పురోగతి కన్పించలేదు. ఐదో రౌండ్‌ చర్చలకు రైతు నేతలను కేంద్రం ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర నిర్ణయం వెలువడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని