Bullet Trains: దక్షిణ భారత్‌కూ బుల్లెట్‌ రైలు.. త్వరలో సర్వే : ప్రధాని మోదీ

తూర్పు, ఉత్తర, దక్షిణ భారత్‌లకూ బుల్లెట్‌ రైలు సేవలు విస్తరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Updated : 14 Apr 2024 14:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో బుల్లెట్‌ రైళ్ల (Bullet Trains)కు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక హామీ ఇచ్చారు. అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ రైలు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్న ఆయన.. ఉత్తర, దక్షిణ, తూర్పు భారత్‌లకూ ఈ రైళ్ల సేవలు విస్తరిస్తామన్నారు. వీటికి సంబంధించిన అధ్యయనం కూడా త్వరలోనే మొదలు కానుందని చెప్పారు. ‘సంకల్ప్‌ పత్ర’ పేరిట భాజపా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

‘‘అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు ఇవి పూర్తి కావచ్చాయి. అదేవిధంగా తూర్పు, ఉత్తర, దక్షిణ భారత్‌కు ఒక్కోటి చొప్పున బుల్లెట్‌ రైలు రానుంది. ఇందుకు సంబంధించిన సర్వే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి’ అని ప్రధాని మోదీ తెలిపారు. ఇప్పటి వరకు సాధించిన అనుభవాలతో ఈ మూడు ప్రాంతాలకు బుల్లెట్‌ రైలు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు భాజపా కట్టుబడి ఉందన్నారు.

సార్వత్రిక ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా

వందేభారత్‌ రైలు సర్వీసులను దేశంలోని ప్రతి మూలకూ విస్తరిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. వందేభారత్‌ స్లీపర్‌, ఛైర్‌కార్‌, మెట్రో అనే మూడు మోడళ్లలో దేశంలో ఇవి నడవనున్నాయని అన్నారు. వందేభారత్‌ సేవలు తొలిసారి ఫిబ్రవరి 2019లో ప్రారంభం కాగా.. ఇప్పటివరకు 51 రైళ్లు దేశవ్యాప్తంగా పరుగులు తీస్తున్నాయి.

ఇక ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య రూ.1.08లక్షల కోట్లతో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును చేపట్టారు. నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NHSRCL) దీనిని నిర్మిస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌కు రూ.10వేల కోట్లను అందిస్తోంది. గుజరాత్‌, మహారాష్ట్రలు రూ.5వేల కోట్లు చొప్పున చెల్లించనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు