PM Modi: భారత్‌ బలం తెలిసొచ్చింది: పాక్‌పై మోదీ వ్యాఖ్యలు

Eenadu icon
By National News Team Published : 31 Oct 2025 12:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: చరిత్ర రాయడంలో సమయం వృథా చేయకూడదని, దానిని సృష్టించాలని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విశ్వసించారు. దానికి తగ్గట్టే భారతదేశాన్ని ఏకంచేసి ఆయన చరిత్ర సృష్టించారని కొనియాడారు. గుజరాత్‌లో ఐక్యతా విగ్రహం (Statue of Unity) వద్ద పటేల్‌ 150వ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు.

‘‘స్వాతంత్ర్యం తర్వాత 550 సంస్థానాలను ఏకం చేసి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశారు. ఆయనకు ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ భారత్‌ దార్శనికత అత్యంత ముఖ్యమైంది. దానిని మేం సమర్థిస్తాం. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల మాదిరిగానే ఏక్తా దివస్‌ను జరుపుకొంటున్నాం. భారతీయులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. విభజన శక్తులకు దూరంగా ఉండాలి. దేశ సమగ్రతకు నక్సలిజం ముప్పుగా పరిణమించింది. నక్సల్స్‌ ఏరివేత కోసం ఎన్నో ఆపరేషన్స్ చేశాం. నక్సలిజం మూలాలను సమూలంగా పెకిలిస్తాం. కశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో కలపాలని పటేల్ (Sardar Vallabhbhai Patel) ఆకాంక్షించారు. దానిని నెహ్రూ గౌరవించలేదు. పటేల్, అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానించింది. ఆయన దూరదృష్టిని మరిచిపోయింది. 

కాంగ్రెస్ చేసిన తప్పు వల్లే కశ్మీర్‌లో కొంత భాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించింది. దానివల్ల కశ్మీర్, దేశంలో అశాంతి నెలకొంది. ఉగ్రవాదాన్ని దాయాది దేశం పెంచి పోషించింది. ఇంత జరిగినా ఉగ్రవాదుల ముందు కాంగ్రెస్ తలవంచింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్‌ బలాన్ని ప్రపంచం మొత్తం చూసింది. మన దేశం నిజమైన బలం ఏంటో ఆ ఉగ్రవాదులకు తెలిసింది. దేశ ఐక్యతను బలోపేతం చేసే చర్యలను ప్రోత్సహించాం. ఆయన ఆకాంక్షలను మేం గౌరవించాం. అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటుంటే కొందరికి బాధగా ఉంటుంది. దేశం నుంచి చొరబాటుదారులను తరిమికొట్టాలని ప్రతిజ్ఞ చేద్దాం’’ అని మోదీ (PM Modi) మాట్లాడారు. పటేల్ జయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం, స్టాంపు విడుదల చేశామని వెల్లడించారు. ఈ రోజు పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా దివస్‌ను పురస్కరించుకొని ప్రత్యేక పరేడ్‌ ఏర్పాటుచేశారు. ఇందులో సైనిక దళాల కవాతు ఆకట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు