DK Shivakumar: ‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్‌ వ్యాఖ్యలపై కేసు నమోదు

DK Shivakumar: తన సోదరుడికి ఓట్లేస్తేనే నీరు సరఫరా చేస్తామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated : 20 Apr 2024 18:53 IST

బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) వేళ రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ప్రధాన నాయకులంతా ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈక్రమంలో కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ (Congress) నేత డీకే శివకుమార్‌ (DK Shivakumar) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన సోదరుడు సురేశ్ తరఫున ప్రచారంలో భాగంగా డీకే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఎన్నికల్లో డీకే సురేశ్‌ బెంగళూరు రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇటీవల తన సోదరుడి తరఫున ఈ ప్రాంతంలో శివకుమార్‌ ప్రచారంలో పాల్గొన్నారు. ఓ హౌసింగ్‌ సొసైటీలో ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అయ్యింది. ‘‘నేను ఇక్కడికి ఓ బిజినెస్‌ డీల్‌ కోసం వచ్చా. నా సోదరుడు సురేశ్‌కు మీరు ఓటేసి గెలిపిస్తే.. మూడు నెలల్లో మీ ప్రధాన సమస్యను పరిష్కరిస్తాను.  కావేరీ నదీ జలాలు సరఫరా చేసి మీకు అవసరమైన నీటిని కూడా కేటాయిస్తాం.’’ అని డిప్యూటీ సీఎం అందులో చెప్పినట్లుగా ఉంది.

ఈ పోలింగ్‌ ‘బ్యూటీ’ ఇంటర్నెట్‌ సెన్సేషన్‌.. ఎవరీ ఈశా అరోడా..?

ఈ వీడియోను భాజపా నేతలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, తన సోదరుడి కోసం ఓట్లు దోపిడీ చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. డీకే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు ధ్రువీకరించింది. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినందుకు గానూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని