Punjab congress: చన్నీ ‘పవర్‌ ప్లే’!

పంజాబ్‌లో విద్యుత్‌ ఛార్జీలు తగ్గిస్తూ చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు యూనిట్‌కు రూ.3 చొప్పున తగ్గిస్తున్నట్లు సీఎం చన్నీ ప్రకటించారు.

Updated : 01 Nov 2021 22:21 IST

చండీగఢ్‌: పంజాబ్‌లో విద్యుత్‌ ఛార్జీలు తగ్గిస్తూ చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు యూనిట్‌కు రూ.3 చొప్పున తగ్గిస్తున్నట్లు సీఎం చన్నీ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయనే స్వయంగా ప్రకటించారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.3,316 కోట్ల అదనపు భారం పడనుంది.

విద్యుత్‌ ఛార్జీలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్కువ ధరకే నాణ్యతతో కూడిన విద్యుత్‌ను ప్రజలు కోరుకుంటున్నట్లు తమ సర్వేలో తేలిందని చన్నీ చెప్పారు. అందుకే దీపావళికి కానుకగా విద్యుత్‌ ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం విద్యుత్‌ సబ్సిడీ కోసం రూ.10,628 కోట్లు వెచ్చిస్తోందని, తాజా నిర్ణయంతో ఆ భారం రూ.14 వేల కోట్లకు పెరగనుందని చెప్పారు. ఈ విషయంలో దిల్లీ ప్రభుత్వంతో పోలిస్తే ఏడు రెట్లు ఎక్కువగా వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గృహ వినియోగదారులకు భారీగా విద్యుత్‌ ఛార్జీలు తగ్గనున్నాయి. వంద యూనిట్లలోపు వినియోగానికి యూనిట్‌కు ప్రస్తుతం రూ.4.19 వసూలు చేస్తుండగా.. ఇకపై రూ.1.19 మాత్రమే వసూలు చేయనున్నారు. 100-300 యూనిట్ల మధ్య వినియోగానికి యూనిట్‌కు రూ.7; 300 యూనిట్లపైన వినియోగానికి రూ.8.76 చొప్పున ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. ఇకపై ఆ మొత్తం రూ.4, రూ.5.76కు తగ్గనుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ చన్నీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. విద్యుత్‌ ఛార్జీల తగ్గింపుతో పాటు ఉద్యోగులకు డీఏను 11 శాతం పెంచుతూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని