Uttarakhand Tunnel: తొలుత భయపడ్డాం.. కానీ, నమ్మకాన్ని వీడలేదు: మోదీతో కార్మికుల సంభాషణ

Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్‌లో సొరంగం నుంచి బయటపడిన కూలీలు ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఈ ప్రభుత్వం తమను కాపాడుతుందనే నమ్మకంతో తాము ధీమాగా ఉన్నామని ప్రధానికి వారు తెలిపారు.

Updated : 29 Nov 2023 12:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని ఉత్తర్‌కాశీ (Uttarkashi Tunnel)లో గల సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల (Workers)ను క్షేమంగా బయటకు తీసుకురావడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. 17 రోజుల పాటు సొరంగంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన ఆ కూలీలు.. మంగళవారం రాత్రి ఎట్టకేలకు బాహ్య ప్రపంచాన్ని చూశారు. వారు బయటకు రాగానే తమను కాపాడిన సహాయక సిబ్బంది, అధికారులకు చెమ్మగిల్లిన కళ్లతో కృతజ్ఞతలు తెలిపారు.

సహాయక చర్యలు పూర్తయిన అనంతరం ప్రధాని మోదీ (PM Modi) కూలీలందరితో ఫోన్లో మాట్లాడి వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. యోగా, మార్నింగ్‌ వాక్‌తోనే తమలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకున్నట్లు ఈ సందర్భంగా ఓ కూలీ ప్రధానికి తెలిపారు. ‘‘మేం సొరంగంలో చిక్కుకుపోయినా చాలా ధైర్యంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారతీయులనే కాపాడింది. దేశంలో ఉన్న మమ్మల్ని కచ్చితంగా కాపాడగలదన్న భరోసాతో ఆందోళన చెందలేదు. ఈ 17 రోజులు మేమంతా కలిసిమెలిసి ఉన్నాం. యోగా, మార్నింగ్‌ వాక్‌ వంటివి చేసి మాలోని స్థైర్యాన్ని పెంచుకున్నాం’’ అని బిహార్‌కు చెందిన ఓ కూలీ ప్రధానితో అన్నారు.

శిథిలాలు కూలగానే..

‘‘నవంబరు 12న సొరంగంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా శిథిలాలు పడ్డాయి. అప్పుడే మేం ఇందులో చిక్కుకుపోయామని అర్థమైంది. తొలి 10-15 గంటలు చాలా కష్టంగా అనిపించింది. ఆ తర్వాత అధికారులు సహాయక చర్యలు చేపట్టి మేం ఉన్న ప్రాంతం వరకు ఓ గొట్టాన్ని పంపించారు. దాని నుంచి అన్నం, పప్పు, డ్రైఫ్రూట్స్‌ వంటివి మాకు అందించారు. మేము చిక్కుకుపోయిన చోట ఓ మైక్‌ను అమర్చడంతో మా కుటుంబసభ్యులతోనూ మాట్లాడగలిగా. సురక్షితంగా బయటపడటం ఆనందంగా ఉంది’’ అని విశ్వజీత్‌ కుమార్‌ వర్మ అనే కార్మికుడు సంతోషం వ్యక్తం చేశారు.

నిషేధించిన విధానమే.. 41మందిని కాపాడింది!

నమ్మకాన్ని కోల్పోలేదు..

‘‘తొలుత కొన్ని గంటలు చాలా ఇబ్బందిపడ్డాం. ఊపిరి కూడా తీసుకోలేకపోయాం. కానీ, ఆ తర్వాత మాకు బాహ్య ప్రపంచంతో కాంటాక్ట్‌ అందింది. నాటి నుంచి పరిస్థితులు సాధారణంగా మారిపోయాయి. సొరంగంలో ఉన్నన్ని రోజులు ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోలేదు. మేం ఆరోగ్యంగా ఉన్నాం. మమ్మల్ని కాపాడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన కార్మికుడు విశాల్‌ తెలిపారు.

ప్రస్తుతం 41 మంది కూలీలు ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు వెల్లడించారు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే వారిని ఎయిమ్స్‌ దేహ్రాదూన్‌కు తరలించనున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజులు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి, క్షేమంగా ఉన్నారని స్పష్టమైన తర్వాతే వారిని స్వస్థలాలకు పంపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు