Bhavani Revanna: ‘సిట్‌’ ముందుకు ప్రజ్వల్‌ తల్లి.. కిడ్నాప్‌ కేసులో ముందస్తు బెయిల్‌

ఓ కిడ్నాప్‌ కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ శుక్రవారం సిట్‌ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. అంతకుముందు ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

Published : 07 Jun 2024 17:19 IST

బెంగళూరు: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హాసన అశ్లీల వీడియో, కిడ్నాప్‌ కేసుల్లో సిట్ (SIT) దర్యాప్తు కొనసాగుతోంది. మహిళలపై లైంగిక దౌర్జన్యం, బ్లాక్‌మెయిల్ ఆరోపణలతో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కిడ్నాప్‌ కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ (Bhavani Revanna)పైనా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఆమె సిట్‌ ముందు విచారణకు హాజరయ్యారు. అంతకుముందు ఈ కేసులో హైకోర్టు ఆమెకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

రేవణ్ణ ఇంటి పనిమనిషి అపహరణ వ్యవహారంలో భర్త రేవణ్ణతో పాటు భవానీకి కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెను విచారించేందుకు సిట్‌ అధికారులు ఇటీవల నోటీసులు పంపారు. హొళెనరసీపురలో నివాసానికి వెళ్లగా ఆమె అందుబాటులో లేకుండా పోయారు. దీంతో పరారీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్‌ కోసం ఆమె హైకోర్టులో దరఖాస్తు చేసుకోగా.. శుక్రవారం మంజూరైంది. అయితే.. మధ్యాహ్నం ఒంటిగంటలోపు సిట్‌ ముందు హాజరుకావడంతోపాటు విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆమె విచారణకు హాజరయ్యారు.

బాలీవుడ్‌పై కంగన ఫైర్‌.. కాసేపటికే పోస్టు డిలీట్‌

మైసూరు జిల్లాలోని కేఆర్ నగర్ తాలూకా పరిధితోపాటు ఆ మహిళ కిడ్నాప్ జరిగినట్లు భావిస్తోన్న హాసన్ జిల్లా పరిధిలోకి భవానీని ప్రవేశించకుండా హైకోర్టు నిషేధం విధించింది. ఇదిలాఉండగా.. ఈ కేసులో రేవణ్ణను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా.. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. మరోవైపు.. మహిళ కిడ్నాప్‌ కేసులో భవానీ కారు డ్రైవర్‌ను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని