రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తా.. పంజాబ్‌ సీఎంకు గవర్నర్‌ హెచ్చరిక!

పంజాబ్‌లో గవర్నర్‌, సీఎం మధ్య లేఖల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. తాను గతంలో రాసిన లేఖలకు సమాధానం చెప్పకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫారు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ గవర్నర్‌ లేఖ రాశారు.

Published : 25 Aug 2023 19:47 IST

చండీగఢ్‌: పంజాబ్‌ (Punjab) గవర్నర్‌ బన్వారిలాల్‌ పురోహిత్‌ (Banwarilal Purohit ), సీఎం భగవంత్‌ మాన్‌(Bhagwant Mann) మధ్య లేఖల యుద్ధం తారస్థాయికి చేరింది. గవర్నర్‌ బన్వారిలాల్‌ శుక్రవారం సీఎంకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. గతంలో తాను రాసిన లేఖలకు సమాధానం ఇవ్వకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తానని.. క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమిస్తానంటూ హెచ్చరించారు. ఈ మేరకు మాన్‌కు పంపిన లేఖను గవర్నర్‌ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు.  గతంలో రాసిన లేఖలపై ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై కలత చెందినట్టు పేర్కొన్నారు. రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యంపై రాష్ట్రపతికి నివేదించగలనంటూ హెచ్చరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 ప్రకారం తాను ‘తుది నిర్ణయం’ తీసుకోవడానికి ముందే చర్యలు తీసుకోవాలని మాన్‌కు సూచించారు.

మన భూభాగాన్ని చైనా లాక్కుంది..! రాహుల్‌ గాంధీ

రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం గురించి ఆర్టికల్ 356 ప్రకారం భారత రాష్ట్రపతికి నివేదిక పంపించడం, IPC సెక్షన్ 124 ప్రకారం క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించడంపై తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు  తన లేఖల ద్వారా కోరిన సమాచారాన్ని పంపించాలని కోరుతున్నట్టు చెప్పారు. అలాగే, రాష్ట్రంలో మాదకద్రవ్యాల సమస్యకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపైనా సమాచారం ఇవ్వాలన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే రాజ్యాంగం, చట్టపరంగా చర్యలు తీసుకోవడం తప్ప తనకు వేరే మార్గం ఉండదన్నారు.

ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ గవర్నర్‌ ముఖ్యమంత్రికి పలుమార్లు లేఖలు రాశారు. ఫిబ్రవరిలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లను సింగపూర్‌ పర్యటనకు ఎంపిక చేయడం సహా పలు అంశాలపై గవర్నర్‌ వివరాలు కోరారు. ఇలాంటి అంశాల విషయంలో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పలు అంశాలపై ప్రభుత్వాన్ని సమాచారం కోరుతూ లేఖలు రాసినా సీఎం భగవంత్‌మాన్‌ నుంచి స్పందన రాకపోవడంతో గతంలోనూ గవర్నర్‌ పలుమార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని