Rahul Gandhi: మన భూభాగాన్ని చైనా లాక్కుంది..! రాహుల్‌ గాంధీ

భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. లద్ధాఖ్‌లోని కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.

Updated : 25 Aug 2023 18:33 IST

లద్ధాఖ్‌: చైనా (China)తో సరిహద్దు వివాదంలో కేంద్రం వైఖరిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న విషయం స్పష్టమని.. కానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈ విషయాన్ని ఖండించడం బాధాకరమని పేర్కొన్నారు. లద్ధాఖ్‌ (Ladakh) పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ శుక్రవారం కార్గిల్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. అనంతరం కార్గిల్‌ యుద్ధ స్మారకం (Kargil War Memorial) వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు.

‘లద్ధాఖ్‌ ఒక వ్యూహాత్మక ప్రాంతం. ఇక్కడ వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా లాక్కుందన్న విషయం స్పష్టం. స్థానికులందరికీ ఈ విషయం తెలుసు. అయితే, లద్ధాఖ్‌లో ఒక్క అంగుళం కూడా చైనా ఆక్రమించలేదని ప్రధాని మోదీ చెప్పడం బాధాకరం. ఇది అబద్ధం’ అని రాహుల్‌ గాంధీ విమర్శించారు. బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా మోదీ, చైనా అధినేత జిన్‌పింగ్‌లు సంభాషించుకున్న వేళ.. రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీ-జిన్‌పింగ్‌ సంభాషణపై చైనా రాజకీయం..

లద్ధాఖ్‌ ప్రజల భూమిని లాక్కొని, ఇతరులకు కట్టబెట్టాలనుకుంటోందని భాజపాపై రాహుల్‌ గాంధీ ఆరోపణలు చేశారు. ‘స్థానికులకు రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తే భూమిని లాక్కోలేమని భాజపా వాళ్లకు తెలుసు. అదే కారణంతో వారు లద్ధాఖ్‌వాసులకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు’ అని విమర్శించారు. హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటకలలో కాంగ్రెస్‌ విజయాలను ప్రస్తావిస్తూ.. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణలలోనూ తమ పార్టీదే విజయమన్నారు.

ఇదిలా ఉండగా.. జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత రాహుల్‌ లద్ధాఖ్‌ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. ‘భారత్‌ జోడో యాత్ర’ సమయంలోనే లద్ధాఖ్‌ను సందర్శించాలనుకున్నానని.. కానీ, విపత్కర వాతావరణ పరిస్థితుల కారణంగా సాధ్యం కాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజా పర్యటన చేపట్టానని, బైక్‌పై ప్రతి మారుమూల ప్రాంతానికి చేరుకుని, ప్రజలతో మమేకమయ్యానని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని