NIA: 17 మంది ఐఎస్ఐఎస్ ఏజెంట్లపై ఎన్ఐఏ ఛార్జిషీట్

విదేశీ హ్యాండ్లర్లతో గ్లోబల్ లింకేజీని బహిర్గతం చేసిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ 17మంది ఐఎస్‌ఐఎస్‌ ఏజెంట్లపై కేసు నమోదు చేసింది.

Published : 04 Jun 2024 12:57 IST

దిల్లీ: విదేశీ హ్యాండ్లర్లతో గ్లోబల్ లింకేజీని బహిర్గతం చేసిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోమవారం నిషేధిత గ్లోబల్ టెర్రరిస్ట్ సంస్థ (ISIS)కు చెందిన 17 మంది ఏజెంట్లపై  ఛార్జిషీట్లు  దాఖలు చేసింది. 2023 మార్చిలో ముగ్గురిపై ఛార్జిషీట్‌ దాఖలు చేసిన ఎన్‌ఐఏ సోమవారం దిల్లీ ప్రత్యేక కోర్టులో మరో 17మందిపై అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. వారిలో 15మంది మహారాష్ట్రకు చెందిన వారు కాగా ఉత్తరాఖండ్‌, హరియాణా నుంచి చెరొకరు ఉన్నారు. దీంతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 20కు చేరుకుందని దర్యాప్తు సంస్థ తెలిపింది.

వీరు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ నుంచి శిక్షణ పొందుతూ వారి కుట్రల్లో సహకరిస్తున్నారని, అమాయక యువతను ట్రాప్‌ చేసి అధునాతన పేలుడు పరికరాలు, ఐఎస్ఐఎస్ విధానాల పట్ల ఆకర్షితులయ్యేలా చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇరాక్, సిరియా(ISIS) భావజాలం వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. దర్యాప్తు సంస్థ వారి నుంచి పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన అనేక నేరారోపణ పత్రాలు, డేటాను స్వాధీనం చేసుకుంది. 

భారత్‌లో హింసను వ్యాప్తి చేయడానికి, దేశంలోని లౌకిక,  ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేయడానికి ఐఎస్‌ఐఎస్‌ ఎజెండాలో భాగంగా వారు తమ ఉగ్రవాద ప్రణాళికలను ఆచరణలో పెడుతున్నారని, దాని కోసం నిధులు సేకరిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈ కేసులో వేగవంతంగా దర్యాప్తు కొనసాగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

 ఉగ్రవాద నెట్‌వర్క్‌ను కూల్చివేయాలనే ఉద్దేశ్యంతో దేశంలో చురుకుగా ఉన్న వివిధ ఐసిస్ మాడ్యూల్స్‌పై విరుచుకుపడుతున్న NIA, ఈ ఉగ్రవాద కుట్రపై దర్యాప్తు చేయడానికి నవంబర్ 2023 లో కేసు నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని