Pune car crash: పుణె కారు ప్రమాద ఘటన.. నిందితుడి కుటుంబం రిసార్ట్‌పైకి బుల్డోజర్‌

Pune car crash: పుణె కారు ప్రమాద ఘటనలో నిందితుడైన ఆ టీనేజర్‌ కుటుంబానికి చెందిన ఓ రిసార్ట్‌ను అధికారులు కూల్చివేశారు. దాన్ని అక్రమంగా నిర్మించినట్లు తెలిపారు.

Published : 08 Jun 2024 18:08 IST

సతారా: మహారాష్ట్రలోని పుణెలో ఇటీవల ఓ టీనేజర్‌ మద్యం తాగి, లగ్జరీ కారును ర్యాష్‌గా నడిపి ఇద్దరి మృతికి కారణమైన ఘటన (Pune car crash) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడికి సంబంధించి మరో వార్త బయటికొచ్చింది. ఆ టీనేజర్‌ కుటుంబానికి చెందిన ఓ రిసార్ట్‌లో అక్రమ కట్టడాలను అధికారులు శనివారం కూల్చేశారు.

మహాబలేశ్వర్‌ (Mahabaleshwar)లోని మల్కంపేట్‌ ప్రాంతంలో నిందితుడి కుటుంబానికి ‘ఎంపీజీ క్లబ్‌’ పేరుతో ఓ రిసార్ట్‌ ఉంది. అందులో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కొన్ని నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం అందింది. దీనిపై గతవారం మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే స్పందించారు. అవి అక్రమ కట్టడాలు అని తేలితే ఆ రిసార్ట్‌పై చర్యలు తీసుకోవాలని సతారా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

నోట్ల కట్టలు.. ట్విస్టులు: క్రైం థ్రిల్లర్ మరిపించేలా పుణె లగ్జరీ కారు ప్రమాదం కేసు

ఈ క్రమంలోనే గతవారం రిసార్ట్‌ (Resort)ను అధికారులు సీల్‌ చేశారు. అనంతరం దీనిపై విచారణ జరపగా ఆ కట్టడాలు అక్రమంగా నిర్మించినట్లు తేలింది. దీంతో శనివారం ఎంపీజీ క్లబ్‌ వద్దకు బుల్డోజర్‌ (Bulldozer)ను తరలించారు. అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చేసినట్లు అధికారులు వెల్లడించారు.

పుణె నగరంలోని సంపన్న స్థిరాస్తి వ్యాపారి కుమారుడు.. మే 19 తెల్లవారుజామున లగ్జరీ కారును వేగంగా నడిపి ఓ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నిందితుడికి బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు విధించిన షరతులతో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తన కుమారుడిని తప్పించేందుకు ఆ వ్యాపారి తీవ్రంగా యత్నించాడని, కుమారుడి రక్త నమూనాలను మార్చేందుకు డాక్టర్‌కు లంచం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ కేసులో నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులు, తాతను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని