Pune: టమాటా సాగుతో నెలలోనే రూ.3 కోట్లు..

టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. ధరలు విపరీతంగా పెరగడంతో మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ రైతు కోటీశ్వరుడయ్యాడు.

Updated : 19 Jul 2023 15:32 IST

పుణె: ప్రస్తుతం టమాటా (tomato) ధరలు తారస్థాయికి చేరాయి. ఎక్కడ చూసినా కిలో ధర రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి టమాటా సాగు చేస్తున్న రైతులకు ఈ ధరలు కలిసిరావడంతో వారి పంట పండింది. తాజాగా మహారాష్ట్రలోని పుణెకు (pune) చెందిన ఈశ్వర్ గైకార్‌ టమాటా సాగుతో కేవలం నెల రోజుల్లోనే ఏకంగా రూ.3 కోట్లను సంపాదించాడు.

దీంతో ఆ రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘‘నాకు 16 ఎకరాల భూమి ఉంది. ఇందులో ఎన్నో ఏళ్లుగా 12 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నాను. గతంలో ధర లేకపోవడంతో గిట్టుబాటు కూడా రాకపోయేది. 2021లో రూ.15-16 లక్షలు నష్టపోయా. గతేడాది కూడా కేవలం స్వల్ప లాభాలు మాత్రమే దక్కాయి. ఈ ఏడాది మే నెలలో తక్కువ ధరల కారణంగా పండించిన టమాటాలను పెద్ద మొత్తంలో పడేయాల్సి వచ్చింది. అప్పుడు ఎంతో బాధగా అనిపించింది. కానీ, గత కొద్ది రోజుల నుంచి ధరలు పెరగడంతో జూన్‌ 11 నుంచి జులై 18 వరకు రూ.3కోట్లు సంపాదించా’’ అంటూ ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇన్నేళ్లలో టమాటా ధరలు ఈ రేంజ్‌లో ఎప్పుడూ పెరగలేదని, ఇప్పుడు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించడంతో కుటుంబమంతా ఆనందంగా ఉన్నామని తెలిపారు.

భారీ వర్షాలు ఇతరత్రా కారణాలతో టమాటా ఉత్పత్తి తగ్గిపోవడంతో గత కొద్ది రోజులుగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో వీటి ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి టమాటాలను కొనుగోలు చేయాలని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్‌సిసిఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (నాఫెడ్)ను కేంద్రం ఆదేశించింది. గతవారం నుంచి ధరలు అధికంగా ఉన్న దిల్లీ-ఎన్‌సిఆర్, పట్నా తదితర ప్రాంతాల్లో టమాటాలను డిస్కౌంట్‌ ధరలకు విక్రయించడం ప్రారంభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు