Pune Car Crash: శాంపిళ్లు మార్చినట్లు ఆరోపణలు..పుణె కారు ప్రమాద ఘటనలో బాలుడి తల్లి అరెస్టు

పుణె కారు ప్రమాద ఘటన (Pune Car Crash)లో మరో అరెస్టు చోటుచేసుకుంది. కొద్దిరోజుల పాటు జాడలేకుండా పోయిన నిందితుడి తల్లి పోలీసులకు చిక్కారు.  

Updated : 01 Jun 2024 10:38 IST

పుణె: మహారాష్ట్రలోని పుణె (Pune)లో ఓ టీనేజర్ ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తమ కుమారుడిని తప్పించేందుకు అతడి కుటుంబం కొందరు అధికారులతో కలిసి చేసిన యత్నాలు విస్తుగొల్పుతున్నాయి. అలాగే బ్లడ్ టెస్ట్ సమయంలో నిందితుడి రక్త నమూనాలు బదులుగా తనవి ఇచ్చిన తల్లిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదం సమయంలో ఆ మైనర్ తాగలేదని నిరూపించేందుకు ఆమె  రక్తనమూనాలు ఇచ్చినట్లు శనివారం పోలీసులు తెలిపారు. (Pune Car Crash)

ప్రమాదం జరిగిన రోజు ఫోరెన్సిక్‌ విభాగం అధిపతి డాక్టర్‌ తావ్‌డే, నిందితుడి తండ్రి ఫోన్‌లో మాట్లాడుకున్నారని ఇదివరకు పలు కథనాలు వెల్లడించాయి. ఆ సందర్భంగా నిందితుడి రక్త నమూనాలను మార్చేస్తే భారీ మొత్తం ఇచ్చేలా డీల్‌ కుదిరిందని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే టీనేజర్ తల్లి శాంపిళ్లను బ్లడ్‌ టెస్ట్‌కు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. రక్త నమూనాలు ఇచ్చిన తర్వాత ఆమె ఆచూకీ లేకుండా పోయారు. అలాగే కొద్దిరోజుల క్రితం ఒక వీడియో సందేశం విడుదల చేసిన ఆమె.. తన కుమారుడిని రక్షించాలంటూ కన్నీరుపెట్టుకున్నారు.

అదృశ్యమైన కోటా విద్యార్థి.. 23 రోజులు.. దేశమంతా చక్కర్లు కొట్టి!

సాక్ష్యాలను తారుమారు చేసినందుకు, శాంపిల్స్‌ను మార్చిన ఆరోపణలపై ఈ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు కోర్టుముందు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే నిందితుడి తండ్రి, తాత కూడా అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసును తనమీద వేసుకోమని తమ డ్రైవర్‌ను ఒప్పించేందుకు యత్నించారని, అతడు అంగీకరించకపోవడంతో కిడ్నాప్‌ చేసి ఒత్తిడి తీసుకొచ్చారన్న ఆరోపణలు వారిద్దరి అరెస్టుకు కారణమయ్యాయి. నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఆ కుటుంబం పలువురు అధికారుల్ని ప్రలోభపెట్టేందుకు యత్నించిందని దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక నిందితుడి శాంపిళ్లు మార్చిన వైద్యుడిపై వేటు పడిన సంగతి తెలిసిందే. డాక్టర్‌ శ్రీహరి హల్నోర్‌ను సాసూన్‌ జనరల్‌ ఆస్పత్రి నుంచి తొలగించారు. అతడిని సర్వీసు నుంచి పూర్తిగా డిస్మిస్‌ చేసినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యూకేషన్‌ అండ్‌ రీసెర్చి ఆఫ్‌ మహారాష్ట్ర ప్రకటించింది. దీంతోపాటు ఈ కేసులో ఉన్న ఫోరెన్సిక్‌ విభాగం అధిపతి డాక్టర్‌ తావ్‌డేపైనా సస్పెన్షన్‌ వేటు వేసింది. వీరితో పాటు గుమస్తాను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని