ISRO: 21వ శతాబ్దపు ‘పుష్పక’ విమానం.. పునర్వినియోగ రాకెట్‌ కీలక ప్రయోగం సక్సెస్‌

ISRO: అంతరిక్ష యాత్రల ఖర్చును భారీగా తగ్గించుకోవడమే లక్ష్యంగా ఇస్రో చేపట్టిన ఆర్‌ఎల్‌వీ మిషన్‌లో మరో ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. 

Published : 22 Mar 2024 10:34 IST

బెంగళూరు: అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను మళ్లీ వినియోగించే ప్రక్రియలో ఇస్రో మరో ముందడుగు వేసింది. ఇస్రో (ISRO) తయారు చేసిన ‘రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌’ అటానమస్‌ ల్యాండింగ్‌ ప్రయోగాన్ని (RLV LEX-02) విజయవంతంగా చేపట్టింది. శుక్రవారం ఉదయం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఏటీఆర్‌) దీనికి వేదికైంది. దీంతో దేశ సాంకేతిక సామర్థ్యాలను విస్తృతం చేసుకోవడంతో పాటు అంతరిక్ష యాత్రల ఖర్చును భారీగా తగ్గించుకునేందుకు ఆర్‌ఎల్‌వీ దోహదపడనుంది.

రెక్కలతో తయారు చేసిన ఈ ఆర్‌ఎల్‌వీకి ఇస్రో ‘పుష్పక్‌’ (Pushpak)గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్‌-01ను పూర్తి చేసిన ఇస్రో (ISRO).. స్వతంత్ర ల్యాండింగ్‌లో పుష్పక్‌ సామర్థ్యాన్ని ఎల్‌ఈఎక్స్‌-02 ద్వారా మరోసారి పరీక్షించింది. ఐఏఎఫ్‌కు చెందిన చినూక్‌ హెలికాప్టర్‌లో ఆర్‌ఎల్‌వీని 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. అవరోధాలు సృష్టించినా వాటన్నింటినీ సరిదిద్దుకుంటూ నిర్దేశిత మార్గంలోకి వచ్చిన ఆర్‌ఎల్‌వీ స్వయంగా ల్యాండవడం విశేషం. అత్యంత కచ్చితత్వంతో రన్‌వేపై దిగిన ఈ వాహక నౌక.. బ్రేక్‌ పారాచూట్‌, ల్యాండింగ్‌ గేర్‌ బ్రేక్స్‌, నోస్‌ వీల్‌ స్టీరింగ్‌ సిస్టమ్‌ సాయంతో తనకు తానే ఆగిపోయింది.

ఆర్‌ఎల్‌వీ (RLV)ల స్వతంత్ర ల్యాండింగ్‌కు కావాల్సిన నావిగేషన్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌, ల్యాండింగ్‌ గేర్‌, డిసిలరేషన్‌ సిస్టమ్స్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతల సామర్థ్యం ఈ ప్రయోగంతో మరోసారి నిరూపితమైంది. ఎల్‌ఈఎక్స్‌-01లో ఉపయోగించిన బాడీ, ఫ్లైట్‌ సిస్టమ్స్‌నే తాజా ప్రయోగంలోనూ వాడారు. దీంతో హార్డ్‌వేర్‌, ఫ్లైట్‌ సిస్టమ్స్‌ పునర్వినియోగ సామర్థ్యం సైతం తాజా ప్రయోగంతో నిరూపితమైంది. ఎల్‌ఈఎక్స్‌-01 పరిశీలనల అనంతరం అధిక లోడ్‌ను తట్టుకునేలా ఎయిర్‌ఫ్రేమ్‌ స్ట్రక్చర్‌, ల్యాండింగ్‌ గేర్‌ను ఈసారి బలోపేతం చేసినట్లు ఇస్రో తెలిపింది.

ఈ మిషన్‌ను ఇస్రో ఇనర్షియల్‌ సిస్టమ్స్‌ యూనిట్‌, లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ సెంటర్‌తో కలిసి విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ విజయవంతంగా చేపట్టింది. ఐఏఎఫ్‌, ఏడీఈ, ఏడీఆర్‌డీఈ, సీఈఎంఐఎల్‌ఏసీ తమ వంతు సహకారాన్ని అందించాయి. ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు