Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్‌కు ఊరట.. బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి నేడు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భాజపా వేసిన పరువునష్టం దావాకు సంబంధించి ఈ ఊరట లభించింది. 

Updated : 07 Jun 2024 12:16 IST

బెంగళూరు: పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఊరట లభించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. వార్తా పత్రికల్లో కాంగ్రెస్‌ పరువునష్టం కలిగించే ప్రకటనలు జారీ చేసిందని ఆరోపిస్తూ.. భాజపా కర్ణాటక యూనిట్‌ ఈ దావా వేసింది. దీని విచారణలో భాగంగా నేడు రాహుల్ కోర్టులో హాజరయ్యారు.

గత భాజపా ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో 40శాతం కమీషన్‌ వసూలుచేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించిందని, ‘ 40 శాతం కమీషన్‌ ప్రభుత్వం’గా అభివర్ణిస్తూ పత్రికల్లో పెద్దఎత్తున ప్రకటనలు గుప్పించిందని పేర్కొంటూ కమలం పార్టీ నేత కేశవ్‌ ప్రసాద్‌ ఆ పార్టీ తరఫున గతంలో పరువు నష్టం దావా వేశారు. వివిధ రకాల ఉద్యోగాలకు భాజపా ‘రేటు కార్డులు’ పెట్టిందంటూ హస్తం పార్టీ పోస్టర్లు అతికించిందని, తద్వారా తమ పార్టీ పరువుకు భంగం కలిగించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ అంశంపై ఇదివరకు విచారణ జరిపిన బెంగళూరులోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar)లకు బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే సహ నిందితుడిగా ఉన్న రాహుల్ జూన్‌ 7న కోర్టులో హాజరుకావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు