prashant kishor: రాహుల్‌ గాంధీ ఆ వైఖరి వీడాలి.. ప్రశాంత్‌ కిశోర్‌ విసుర్లు

కాంగ్రెస్‌ను కాపాడేది తానేనన్న మొండి వైఖరిని రాహుల్‌ గాంధీ వీడాలని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు. 

Published : 08 Apr 2024 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కాంగ్రెస్‌ (Congress) పార్టీకి ఆశించిన ఫలితాలు రాని పక్షంలో తన బాధ్యతల నుంచి వెనక్కి తగ్గే ఆలోచన చేయాలని అగ్రనేత రాహుల్‌ గాంధీకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) సూచించారు. పీటీఐ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పార్టీపరంగా రాహుల్‌ (Rahul Gandhi) పదేళ్లుగా ఎటువంటి భారీ ఫలితాలు సాధించలేదు. తాను పక్కకు తప్పుకోవడమో.. ఇతరులకు అవకాశం ఇవ్వడమో కూడా చేయడం లేదు. ఇది అప్రజాస్వామికమే. పార్టీని కాపాడేది తానేనన్న మొండివైఖరిని ఆయన వీడాలి’’ అని వ్యాఖ్యానించారు. 

‘‘సక్సెస్‌ లేకుండా ఒకే పనిని పదేళ్లుగా చేస్తున్నట్లయితే.. అందులో విరామం తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. వేరేవారికి ఆ అవకాశం ఇవ్వాలి. సోనియా గాంధీ అలాగే చేశారు. తన భర్త రాజీవ్‌ గాంధీ హత్యానంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె.. పీవీ నరసింహారావుకు బాధ్యతలు అప్పగించారు’’ అని ప్రశాంత్‌ కిశోర్‌ గుర్తుచేశారు. తనకు అన్నీ తెలుసని రాహుల్‌ భావిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. మనకు సాయం అవసరమన్న విషయాన్ని గుర్తించకపోతే.. ఎవరూ ముందుకురారు’’ అని పేర్కొన్నారు.

భాజపాకు 300కు పైగా సీట్లు.. తెలంగాణలో తొలి లేదా రెండో స్థానం: ప్రశాంత్‌ కిశోర్‌

‘‘2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే సమయంలో.. ఆ బాధ్యతలు వేరేవారు తీసుకోవాల్సిందిగా రాహుల్‌ కోరారు. కానీ.. దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఫలానా వ్యక్తి ఆమోదం లేకుండా ఒక్క సీటుపై కూడా నిర్ణయం తీసుకోలేమని ఆ పార్టీ నేతలే ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు. ఈడీ, సీబీఐ, ఎన్నికల సంఘం వంటివి రాజీ పడటం వల్లే తమ పార్టీకి ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్న రాహుల్‌ వాదనను ప్రశ్నిస్తూ.. ఇది పూర్తిగా నిజం కాదన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 206 సీట్ల నుంచి 44కి పడిపోయిందని.. అప్పుడు ఆయా సంస్థలపై భాజపా ప్రభావం తక్కువేనని విశ్లేషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని