Bullet Train: తొలి బుల్లెట్‌ రైలు స్టేషన్‌ను వీక్షించారా..?

ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య బుల్లెట్‌ ప్రాజెక్టు రైలు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్‌ స్టేషన్‌ వీడియోను కేంద్ర మంత్రి ఎక్స్‌ (ట్విటర్‌)లో విడుదల చేశారు.

Updated : 08 Dec 2023 15:35 IST

ఇంటర్నెట్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సమచారాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ పంచుకొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కారిడార్‌ హబ్‌లో తొలి బుల్లెట్‌ రైలు కోసం నిర్మించిన స్టేషన్‌ వీడియోను ఆయన షేర్‌ చేశారు. ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య దేశంలోనే తొలిసారి హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే.

విదేశాల్లో 403 మంది భారత విద్యార్థుల మృతి.. అత్యధికంగా కెనడాలోనే

అహ్మదాబాద్‌ స్టేషన్‌ను జంట భవనాలుగా రూపొందించారు.  వీటి గోడలపై ఉప్పు సత్యాగ్రహం సన్నివేశాలకు సంబంధించిన భారీ చిత్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్‌ మొత్తం విస్తీర్ణం 1,33,000 చదరపు మీటర్లు. దీనిలో ఆఫీస్‌లు, వాణిజ్య కార్యాలయాలు, రిటైల్‌ స్టోర్లు ఏర్పాటు చేసుకొనే విధంగా నిర్మించారు. ఈ మొత్తం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

మరోవైపు ముంబయిలో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ స్టేషన్‌ సివిల్‌ వర్క్స్‌ దాదాపు 15శాతం పూర్తయ్యాయని గత నెల నేషనల్‌ హైస్పీడ్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. ఈ ప్రాజెక్టులోని ఏకైక అండర్‌గ్రౌండ్‌ స్టేషన్‌ ఇదే.  16 కోచ్‌ల బుల్లెట్‌ రైలు కోసం నిర్మించిన ఈ స్టేషన్‌లో ఆరు ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.

రెండు ఆర్థిక కేంద్రాలను అనుసంధానిస్తూ 508 కిలోమీటర్ల మేరకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. వీటిల్లో 448 కిలోమీటర్ల ప్రయాణం ఎత్తైన కారిడార్‌పై జరుగుతుంది. మరో 26 కిలోమీటర్లు సొరంగ మార్గాల్లో, 10 కిలోమీటర్లు వంతెనలపై, 7 కిలోమీటర్లు ఘాట్‌ మార్గాల్లో ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని