Rahul Gandhi: సంపన్నులను దృష్టిలో ఉంచుకొనే ‘రైల్వే’ విధానాలు : రాహుల్‌ ఆరోపణ

వివిధ ఛార్జీల పేరుతో టికెట్టు ధరలను పెంచడమే కాకుండా.. ఏసీ బోగీలను గణనీయంగా పెంచుతూ సాధారణ ప్రయాణికులను రైల్వేలకు దూరం చేస్తున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

Published : 03 Mar 2024 14:15 IST

దిల్లీ: సంపన్నులను దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వేలో (Indian Railways) విధానాలను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. వివిధ ఛార్జీల పేరుతో టికెట్టు ధరలను పెంచడమే కాకుండా.. ఏసీ బోగీలను గణనీయంగా పెంచుతూ సాధారణ ప్రయాణికులకు రైల్వేలను దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు. భారతీయ రైల్వే విధానాలను వ్యతిరేకిస్తూ ఎక్స్‌ వేదికగా రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.

‘డైనమిక్‌ ఛార్జీల పేరుతో దోచుకోవడం, పెరుగుతోన్న క్యాన్సలేషన్‌ రుసుం, ప్లాట్‌ఫామ్‌ టికెట్ల ధరల పెంపు, ఇతర పేర్లతో టికెట్లపై ఏటా 10శాతం పెంచుతున్నారు. పేదలు అడుగు పెట్టలేని ఉన్నత వర్గం రైలును చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారు. వయోవృద్ధులకు ఇచ్చే మినహాయింపులను వెనక్కి తీసుకోవడం ద్వారా గడిచిన మూడేళ్లలో ప్రభుత్వం రూ.3700 కోట్ల ఆదాయం పొందింది. కార్మికులు, రైతులే కాకుండా విద్యార్థులు ప్రయాణించే జనరల్‌ బోగీలను తగ్గిస్తూ ఏసీ కోచ్‌లను గణనీయంగా పెంచుతున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రయాణికులకు రైల్వేల్లో ప్రాధాన్యత లేకుండా పోయింది’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

మా అనుమతి లేకుండా ఇంటర్వ్యూ చేస్తారా.. భారత మీడియాపై చైనా రుసరుస

ఇటువంటి దోపిడీలను దాచేందుకే రైల్వేకు ప్రత్యేక బడ్జెట్‌కు ముగింపు పలికారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కేవలం సంపన్నులను దృష్టిలో ఉంచుకొనే రైల్వే విధానాలను రూపొందిస్తున్నారని అన్నారు. ఇలా చేయడం రైల్వేపై ఆధారపడే కోట్ల మంది ప్రజలను మోసగించడమేనని దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని