Indian Railways: గంటకు 20కి.మీ వెళ్లాల్సిన చోట.. 120కి.మీ వేగంతో దూసుకెళ్లిన రైళ్లు..

గంటకు 20కి.మీ వేగ పరిమితి ఉన్న చోట 120 కి.మీ వేగంతో వెళ్లిన గతిమాన్‌, మాల్వా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల లోకో పైలట్లపై సస్పెన్షన్‌ వేటు పడింది.

Updated : 25 May 2024 07:15 IST

దిల్లీ: పరిమితికి మించిన వేగంతో రైళ్లను నడిపిన కారణంగా పలువురు లోకోపైలట్లపై భారతీయ రైల్వే (Indian Railways) వేటు వేసింది. గంటకు 20కి.మీ వేగ పరిమితి ఉన్నచోట 120 కి.మీ వేగంతో రైళ్లను నడిపినట్లు గుర్తించిన అధికారులు.. గతిమాన్‌, మాల్వా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల లోకో పైలట్లపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

ఆగ్రా కంటోన్మెంట్‌కు సమీపంలోని జజువా, మనియా రైల్వే స్టేషన్ల మధ్య ఓ రైల్వే వంతెన పునరుద్ధరణ పనులను ఇటీవల చేపట్టారు. ఈ సమయంలో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్ల వేగాన్ని గంటకు 20కి.మీలకు తగ్గించారు. అయితే, దిల్లీలోని హజ్రత్‌ నిజాముద్దీన్‌- యూపీలోని ఝాన్సీ జంక్షన్‌ల మధ్య నడిచే గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రం గంటకు దాదాపు 120కి.మీ వేగంతో పరుగులు తీసింది.

రేవ్‌ పార్టీపై రగడ.. ‘ఉడ్తా బెంగళూరు’పై కన్నడనాట మాటల యుద్ధం

ఈ ఘటన జరిగిన రెండు, మూడు రోజులకు జమ్మూలోని కాట్రా-మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ల మధ్య నడిచే  మాల్వా ఎక్స్‌ప్రెస్‌ విషయంలోనూ అదే ప్రాంతంలో ఈ తరహా ఉల్లంఘనే జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ రైలును కూడా అత్యంత వేగంగా నడిపినట్లు నిర్ధరించారు.

ముందస్తు హెచ్చరికల గురించి సహాయక లోకోపైలట్‌కు గట్టిగా చెబుతారని, వాటిని లోకోపైలట్‌ తిరిగి చెప్పే విధానం ఉంటుందని, అయినప్పటికీ ఈ తప్పిదం జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. వేగాన్ని తగ్గించడం మరచిపోయినట్లు కనిపిస్తున్నప్పటికీ.. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను ఫణంగా పెట్టడమే అవుతుందని, ఈ క్రమంలోనే శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని