Chennai: ‘మిగ్‌జాం’ ఎఫెక్ట్‌.. స్తంభించిన చెన్నై

మిగ్‌జాం తుపాను తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం దాదాపు స్తంభించిపోయింది. 

Updated : 04 Dec 2023 19:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మిగ్‌జాం తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని 14 రైల్వే సబ్‌వేల్లోకి నీరు చేరడంతో వాటిని మూసివేశారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నగరం, చుట్టుపక్కల జిల్లాల్లో మరో 24 గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఇప్పటికే చెన్నైలో మోహరించారు.

👉 Follow EENADU WhatsApp Channel

తాంబ్రం ప్రాంతంలో ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. నీటిలో చిక్కుకొన్న 15 మందిని కాపాడాయి. బాసిన్‌ బ్రిడ్జ్‌, వ్యాసర్‌పాడి మధ్యలోని బ్రిడ్జ్‌ నెం:14ను మూసివేసినట్లు ప్రకటించారు. ఈ ప్రాంతంలో చాలా ప్రదేశాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పాఠశాలలు మూసివేశారు. నగరంలోని కోర్టులకు సెలవు ఇచ్చినట్లు మద్రాస్‌ హైకోర్టు ప్రకటించింది. వీలైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరారు.

  • చెన్నై-మైసూర్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, కోయంబత్తూర్‌ కోవై ఎక్స్‌ప్రెస్‌, కోయంబత్తూర్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, కేఎస్‌ఆర్‌ బెంగళూరు ఏసీ డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌, కేఎస్‌ఆర్‌ బెంగళూరు బృందావన్‌ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం రద్దు చేశారు. దీంతోపాటు సబర్బన్‌ రైళ్లను కూడా రద్దు చేశారు. 
  • నగరంలోని పలు పల్లపు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వలసరవాక్కంలో 154 ఎంఎం, నుంగంబాక్కంలో 101 ఎంఎం, చోలింగనల్లూరులో 125 ఎంఎం, కోడంబాక్కంలో 123 ఎంఎం, మీనంబాక్కం 108 ఎంఎం వర్షపాతం నమోదైంది.
  • కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.
  • చెన్నైలోని కాంతూరు ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ఓ గోడ కూలి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఈస్ట్‌కోస్టల్‌ రోడ్డులో సోమవారం ఉదయం చోటు చేసుకొంది.
  • కిల్పాకు మెడికల్‌ కాలేజీలోని ఓ వార్డు ఓపీ విభాగంలోకి వరద చేరింది. దీంతో ఈ విభాగాన్ని మొదటి ఫ్లోరుకు తరలించారు.
  • చెన్నైలోనీ ఎంటీసీ సంస్థ మొత్తం 2,800 బస్సుల్లో కేవలం 600 మాత్రమే తిప్పుతోంది. చాలా మంది సిబ్బంది విధులకు హాజరుకాలేదని  అధికారులు వెల్లడించారు. దీంతో ప్రైవేటు వాహనాల్లో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
  • కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. చాలా విమానాలను చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి మళ్లించారు. ఇప్పటి వరకు దాదాపు 11 విమానాలను దారి మళ్లించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని