Rajasthan HC: న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు.. రాజస్థాన్‌ సీఎంకు షోకాజ్‌ నోటీసులు

రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌కు రాష్ట్ర హైకోర్టు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకుగానూ ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు శనివారం విచారించింది.

Published : 02 Sep 2023 15:53 IST

జైపుర్: న్యాయవ్యవస్థ (Judiciary)పై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) చేసిన వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్‌ హైకోర్టు (Rajasthan High Court) శనివారం సీఎం గహ్లోత్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో గహ్లోత్‌పై సుమోటోగా క్రిమినల్‌ ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ న్యాయవాది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై శనివారం విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్‌ అశుతోష్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.

ప్రతి సీజన్‌లో భాగస్వామిని మార్చేసే.. సహజీవన బంధాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

మూడు వారాల్లోగా జవాబు ఇవ్వాలని సీఎం గహ్లోత్‌ను ఆదేశించింది. ఇటీవల జైపుర్‌లో మీడియాతో మాట్లాడిన గహ్లోత్‌.. ఈ రోజుల్లో న్యాయవ్యవస్థలో అవినీతి పెచ్చరిల్లిపోయిందని ఆరోపిస్తూ.. తీర్పుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో.. తాను చెప్పింది తన వ్యక్తిగత అభిప్రాయం కాదని వివరణ ఇచ్చారు. న్యాయవ్యవస్థను ఎప్పుడూ గౌరవిస్తానని, నమ్ముతానని తెలిపారు. మరోవైపు.. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం జోధ్‌పుర్‌లోని హైకోర్టు, దిగువ కోర్టుల్లో వేలాది మంది న్యాయవాదులు విధులను బహిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని