Exit polls: భాజపా ఖాతాలోకి రాజస్థాన్‌.. మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ!

Exit poll 2023: రాజస్థాన్‌లో భాజపా.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రానున్నాయని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. మధ్యప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్‌, భాజపా మధ్య హోరాహోరీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.

Updated : 30 Nov 2023 21:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువడ్డాయి. ఇందులో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ రెండు పార్టీలకు కీలకం. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు వెలువడ్డాయి. రాజస్థాన్‌లో ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని కోల్పోబోతోందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం మరోసారి కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలోకి రానున్నట్లు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపాకు, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ ఉండబోతోందని అంచనాలు ఉన్నాయి.

తెలంగాణలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్‌కే.. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలివే!

రాజస్థాన్‌లో గహ్లోత్‌కు షాక్‌..!

రాజస్థాన్‌లో అశోక్‌ గహ్లోత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌కు షాక్‌ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్‌లో 200 స్థానాలకు గాను 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికారం చేపట్టాలంటే 100 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది. ఎడారి రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉంది. కానీ తాము మళ్లీ అధికారం నిలబెట్టుకుంటామని కాంగ్రెస్‌ చెప్తూ వచ్చింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు మాత్రం మరోసారి సంప్రదాయమే రిపీట్‌ కానుందని అంచనా వేస్తున్నాయి. మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్‌ భాజపాకు మెజారిటీని కట్టబెట్టాయి. అయితే, కాంగ్రెస్‌ అధికారానికి దూరమైనా భాజపాకు గట్టి పోటీ ఇవ్వనుందని కొన్ని సర్వేలు పేర్కొన్నాయి.

తాజా వార్తల కోసం Eenadu.net వాట్సప్‌ ఛానెల్‌ ఫాలో అవ్వండి..


ఛత్తీస్‌గఢ్‌లో హస్తం

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ హస్తానికే ఓటర్లు పట్టం కట్టనున్నారని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. 90 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ మళ్లీ అధికారం రావొచ్చని అంచనా వేశాయి. అదే సమయంలో గత ఎన్నికల్లో 15 స్థానాలకే పరిమితమైన భాజపాకు ఈ సారి సీట్లు భారీగానే పెరగనున్నాయని పేర్కొన్నాయి. ఇక్కడ అధికారం చేపట్టాలంటే 45 స్థానాల్లో గెలుపొందాలి.


మధ్యప్రదేశ్‌లో టఫ్‌ ఫైట్‌

మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో 114 స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. భాజపాకు 109 స్థానాలు వచ్చాయి. కమల్‌నాథ్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. సింథియా తిరుగుబాటుతో కాంగ్రెస్‌ అధికారం కోల్పోగా.. భాజపా అధికారం చేపట్టింది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 116 స్థానాల్లో గెలుపొందాలి. అయితే, ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు మాత్రం ఏ ఒక్క పార్టీకి పట్టం కట్టలేదు. కొన్ని సంస్థలు కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయంటే.. మరికొన్ని భాజపాకు అధిక సీట్లు వస్తాయని అంచనా వేశాయి. దీంతో ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. ఫలితాల రోజే అసలు విషయం తేలుతుంది.


మిజోరంలో ఎవరో?

మొత్తం 40 స్థానాలున్న మిజోరంలో త్రిముఖ పోరు నెలకొంది. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (MNF), కాంగ్రెస్‌, జోరం పీపుల్స్‌ మూమెంట్ (ZPM) మధ్యే ప్రధాన పోటీ. భాజపా సైతం పోటీలో ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎంఎన్‌ఎఫ్‌కు, జడ్‌పీఎంకు మధ్య గట్టిపోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా ప్రభావం నామమాత్రమే. కాంగ్రెస్‌ కొన్నిసీట్లలో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. భాజపాకు ఒకటీ, రెండు కూడా కష్టమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని