Rajnath Singh: ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్‌నాథ్‌ సూచన

రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. 

Updated : 19 Apr 2024 12:28 IST

కొట్టాయం: ‘‘మీకు కుమారుడికి ఓటేయకపోయినా.. కనీసం అతడిని ఆశీర్వదించండి’’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ (AK Antony)ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) కోరారు. ఆంటోనీ కుమారుడు అనిల్‌ (Anil Antony) భాజపా టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

అనిల్ గతేడాది కమలం పార్టీలో చేరారు. కేరళలోని పథనంథిట్ట నుంచి ఆయనకు టికెట్ దక్కింది. ఆ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాజ్‌నాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘‘ఏకే ఆంటోనీజీకి నేను చెప్పాలనుకునేది ఒక్కటే. మీ కుమారుడికి మీరు ఓటు వేయకపోయినా కనీసం ఆశీస్సులైనా అందించాలి. కొద్దిరోజుల క్రితం ఆయన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆంటోనీ ఇబ్బందిని అర్థం చేసుకోగలను. కాంగ్రెస్‌ ఒత్తిడి వల్ల అలా మాట్లాడి ఉండొచ్చు’’ అని అన్నారు.

కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

అనిల్ భాజపాలో చేరడంపై ఇటీవల ఏకే ఆంటోనీ బహిరంగంగా స్పందించారు. తన కుమారుడు ఓడిపోవాలని, ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి అయిన ఆంటో ఆంటోనీ విజయం సాధించాలని అన్నారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ నా మతం’’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికలు భారత్‌, దాని రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించినవి అయినందునే మీడియా సమావేశంలో మాట్లాడేందుకు వచ్చినట్లు వెల్లడించారు.

తన తండ్రి వ్యాఖ్యలపై స్పందించిన అనిల్‌.. కాంగ్రెస్‌లో కాలం చెల్లిన నేతలు ఉన్నారని, తన తండ్రి పరిస్థితి చూస్తే జాలేస్తోందని వ్యాఖ్యానించారు. పథనంథిట్టలో తన విజయం ఖాయమని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని