Patanjali Case: చిత్తశుద్ధితో క్షమాపణలు చెబుతున్నాం.. ‘సుప్రీం’లో రామ్‌దేవ్‌ అఫిడవిట్‌

యోగా గురు రామ్‌దేవ్‌, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణలు సుప్రీం కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ వేర్వేరు అఫిడవిట్లు దాఖలు చేశారు.

Published : 09 Apr 2024 22:50 IST

దిల్లీ: పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురు రామ్‌దేవ్‌ (Ramdev), ఆ కంపెనీ ఎండీ ఆచార్య బాలకృష్ణలు సుప్రీం కోర్టు (Supreme Court)కు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసులో కోర్టు ధిక్కరణ చర్యల షోకాజ్‌ నోటీసులకు సంబంధించిన వ్యవహారంలో ఈ ఇద్దరు వేర్వేరుగా మరోసారి అఫిడవిట్‌లు దాఖలు చేశారు.

‘‘గతేడాది నవంబరు 21న న్యాయస్థానం ముందు పతంజలి ఇచ్చిన హామీని ఉల్లంఘించినందుకుగానూ బేషరతుగా, చిత్తశుద్ధితో క్షమాపణలను తెలియజేస్తున్నాను. మరోసారి అటువంటి ప్రకటనలు జారీ చేయం. గత ఏడాది నవంబర్ 22న నిర్వహించిన మీడియా సమావేశం విషయంలోనూ క్షమాపణలు కోరుతున్నా. కోర్టు ముందు ఇచ్చిన హామీని ఉల్లంఘించేలా ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయను’’ అని తాజా అఫిడవిట్‌లో రామ్‌దేవ్‌ పేర్కొన్నారు. బాలకృష్ణ సైతం వ్యక్తిగతంగా, సంస్థ తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.

మీ క్షమాపణలను అంగీకరించలేం

తమ సంస్థ ఉత్పత్తుల తయారీ, వాటి ప్రచారం, వాణిజ్య ప్రకటనల విషయంలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడబోమంటూ గత ఏడాది నవంబరు 21న పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ హామీ ఇచ్చింది. తమ ఔషధాల ప్రభావశీలతను వివరించడం కోసం ఇతర వైద్య విధానాలను కించపరచబోమనీ తెలిపింది. అయితే, ఆ వాగ్దానాలను పతంజలి పట్టించుకోకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇద్దరు ఇదివరకే సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్‌లు దాఖలు చేశారు. ఈనెల 2వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు.

వారిద్దరి క్షమాపణల్లో నిజాయతీ కనిపించడం లేదని పేర్కొన్న జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లాల ధర్మాసనం.. వాటిని అంగీకరించబోమని స్పష్టం చేసింది. చివరిసారిగా మళ్లీ కొత్త అఫిడవిట్లు దాఖలు చేయడానికి వారం గడువు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 10న మరోసారి న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే వారు మరోసారి అఫిడవిట్‌లు సమర్పించారు. బుధవారం ఈ కేసు విచారణకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని