Randeep Hooda: ఆ గుర్తుతెలియని వ్యక్తులకు థ్యాంక్స్‌: పాక్‌ డాన్‌ హత్యపై నటుడి పోస్టు

ఓ భారతీయుడిని చంపిన కేసులో నిందితుడైన పాక్‌ డాన్ హత్యపై బాలీవుడ్ నటుడు స్పందించారు. 

Updated : 15 Apr 2024 10:53 IST

దిల్లీ: భారత్‌కు చెందిన సరబ్‌జిత్‌ సింగ్‌ (Sarabjit Singh)ను పాకిస్థాన్‌ జైల్లో చంపిన కేసులో నిందితుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్‌కు చెందిన నటుడు రణ్‌దీప్ హుడా (Randeep Hooda) స్పందించారు. ఆ గుర్తుతెలియని వ్యక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌కు అత్యంత సన్నిహితుడు, పాకిస్థాన్‌లో మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న అమీర్‌ సర్ఫరాజ్‌ తాంబాను కొందరు ఆదివారం హత్య చేశారు. లాహోర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సరబ్‌జిత్‌పై దాడి చేసిన నిందితుల్లో సర్ఫరాజ్‌ ఒకడు. దీనిని ఉద్దేశించి హుడా స్పందిస్తూ.. ‘‘కర్మ.. ఈ గుర్తు తెలియని వ్యక్తులకు థ్యాంక్యూ. ఆ అమరవీరుడికి కొంత న్యాయం జరిగింది’’ అని పోస్టులో పేర్కొన్నారు. అలాగే దల్బీర్‌కౌర్‌ను గుర్తుచేసుకున్నారు.

సరబ్‌జీత్‌ సింగ్‌ హంతకుడి హత్య

పంజాబ్‌కు చెందిన సరబ్‌జిత్‌.. పాకిస్థాన్‌లోకి అక్రమంగా ప్రవేశించాడనే కారణంతో 1990లో అరెస్టయ్యాడు. పంజాబ్‌ ప్రావిన్సులో అనేక బాంబు పేలుళ్లలో అతడు పాల్గొన్నట్లు అభియోగాలు మోపిన పాక్‌.. మరణశిక్ష విధించింది. ఈ క్రమంలో లాహోర్‌లో కోట్‌ లఖపత్‌ జైల్లో ఉన్న అతడిపై తోటి ఖైదీలు దాడులకు తెగబడ్డారు. ఇటుకలు, ఇనుప కడ్డీలతో కొట్టి తీవ్రంగా గాయపర్చారు. దాంతో కోమాలోకి వెళ్లిపోయిన సరబ్‌జిత్‌.. మే 2, 2013న ప్రాణాలు కోల్పోయాడు.

పొరపాటున తన సోదరుడు సరిహద్దు దాటాడని వేడుకున్న అతడి సోదరి దల్బీర్‌కౌర్‌.. ఆయన్ను విడిపించేందుకు సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. ఆమె గతేడాది మరణించారు. సరబ్‌జిత్‌ పేరుతో ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వంలో 2016లో ఓ బయోపిక్‌ కూడా వచ్చింది. ఇందులో రణదీప్‌ హుడా, ఐశ్వర్యరాయ్‌ నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని