Bombay High Court: అర్ధరాత్రి విచారణా..? నిద్రించే హక్కును ఉల్లంఘించడమే: బాంబే హైకోర్టు

అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక సీనియర్ సిటిజన్‌ను ఈడీ ప్రశ్నించడాన్ని బాంబే హైకోర్టు తప్పుపట్టింది. ఆ పద్ధతిని తాము అంగీకరించలేమని తెలిపింది. 

Updated : 16 Apr 2024 11:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నిద్రించే హక్కును ఉల్లంఘించలేమని, అది మనుషుల ప్రాథమిక అవసరమని బాంబే హైకోర్టు (Bombay High Court) అభిప్రాయపడింది. ఓ వ్యక్తి విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేసింది.

మనీలాండరింగ్ కేసులో భాగంగా గత ఏడాది ఆగస్టులో 64 ఏళ్ల రామ్‌ ఇస్రానీని దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. దానిని సవాలు చేస్తూ అతడు కోర్టును ఆశ్రయించారు. తాను విచారణకు సహకరించానని, పిలిచినప్పుడల్లా హాజరైనా సరే అరెస్టు చేశారని, అది చట్ట విరుద్ధమంటూ తన పిటిషన్‌లో ఆరోపించారు. గత ఆగస్టు 7న అధికారులు తనను రాత్రి అంతా విచారించి మర్నాడు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం.. ఇస్రానీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అయితే అతడిని రాత్రి అంతా ప్రశ్నించడాన్ని మాత్రం తప్పుపట్టింది. నిందితుడి అంగీకారంతోనే తెల్లవారుజాము మూడు గంటల వరకు విచారించినట్లు ఈడీ తరపు న్యాయవాది వాదించడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 

కేజ్రీవాల్‌ను కరడుగట్టిన తీవ్రవాదిలా చూస్తున్నారు

‘‘ఏది ఏమైనా అర్ధరాత్రి తర్వాత వాంగ్మూలాన్ని రికార్డు చేసే పద్ధతిని మేం నిరాకరిస్తున్నాం. నిద్ర మనుషుల కనీస అవసరం. దానిని అందించలేకపోవడం హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది. అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పగటిపూట మాత్రమే వాంగ్మూలాలను రికార్డు చేయాలి. పిటిషనర్ సమ్మతించినప్పటికీ.. తర్వాత రోజో లేక మరో సారో ఆ వ్యక్తిని విచారణకు పిలిచి ఉండాల్సింది’’ అని వ్యాఖ్యానించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని