Ritika Sajdeh: రఫాపై పోస్ట్‌.. రోహిత్‌ శర్మ సతీమణిపై నెటిజన్ల ట్రోల్స్‌

Ritika Sajdeh: రఫాకు మద్దతుగా టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సతీమణి రితికా సజ్దే చేసిన ఓ పోస్ట్‌ విమర్శలకు దారితీసింది. దీంతో దాన్ని ఆమె తొలగించారు. అసలేం జరిగిందంటే..?

Published : 29 May 2024 12:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాజాలోని రఫా (Rafah) నగరంలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులపై ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. దీంతో పాలస్తీనా పౌరులకు మద్దతుగా అంతర్జాతీయంగా అనేకమంది సెలబ్రిటీలు గళమెత్తారు. ఈ క్రమంలోనే ‘ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా (All eyes on Rafah)’ అనే పదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) సతీమణి రితికా సజ్దే (Ritika Sajdeh) కూడా రఫా మారణహోమంపై స్పందించారు.

 ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ‘ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా’ అని రాసి ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. అయితే, దీనిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. కశ్మీరీ పండిట్లు, మణిపుర్‌లో హింస ఇలా దేశంలో నెలకొన్న సమస్యలపై ఏనాడైనా మాట్లాడారా? అంటూ పలువురు నెటిజన్లు రితికను ప్రశ్నించారు. కేవలం ట్రెండ్‌ను ఫాలో అవుతూ పోస్టులు చేయడం సరికాదని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో రితిక ఆ స్టోరీని తొలగించారు.

ఇది యుద్ధం కాదు.. మారణహోమం: కాల్పుల విరమణకు గళమెత్తిన భారత సెలబ్రిటీలు

సురక్షిత ప్రాంతంగా చెబుతూనే రఫాలోని ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ (Israel) దాడి చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడిలో పిల్లలు, మహిళలు సహా 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు సంబంధించిన భీతావహ దృశ్యాలు యావత్‌ ప్రపంచాన్ని కలిచివేస్తున్నాయి. ఈ క్రమంలోనే మన దేశానికి చెందిన పలువురు ప్రముఖులు పాలస్తీనాకు మద్దతుగా పోస్ట్‌లు చేస్తున్నారు. సమంత, త్రిష, మాళవికా మోహనన్‌, రష్మిక, దుల్కర్ సల్మాన్‌, పార్వతి తిరువొత్తు, అమీ జాక్సన్, అలియా భట్‌, కరీనాకపూర్‌, ప్రియాంకా చోప్రా, వరుణ్‌ ధావన్‌, సోనాక్షి సిన్హా, దియా మీర్జా, త్రిప్తి డిమ్రి, రిచా చద్దా పాలస్తీనా ప్రజలకు తమ సంఘీభావాన్ని తెలిపిన వారిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని