Raghav Chadha: ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చడ్డాపై సస్పెన్షన్‌ ఎత్తివేత

Raghav Chadha: ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చడ్డాపై విధించిన నిరవధిక సస్పెన్షన్‌ను రాజ్యసభ ఛైర్మన్‌ ఎత్తివేశారు. దీంతో మళ్లీ ఆయన పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు.

Published : 04 Dec 2023 16:46 IST

దిల్లీ: ఎంపీల సంతకాల ఫోర్జరీ ఆరోపణల వ్యవహారంలో ఆప్‌ (AAP) ఎంపీ రాఘవ్‌ చడ్డా (Raghav Chadha) తప్పు చేసినట్లు రాజ్యసభ ప్రివిలేజ్‌ కమిటీ తేల్చింది. మరోవైపు ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను రాజ్యసభ (Rajya Sabha) ఛైర్మన్‌ ఎత్తివేశారు. దీంతో 115 రోజుల తర్వాత ఆయన మళ్లీ పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు.

ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశారని ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చడ్డాను ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీన రాజ్యసభ నుంచి నిరవధికంగా సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. తమ అనుమతి లేకుండా తమను దిల్లీ బిల్లు (Delhi Services Bill) ప్రతిపాదిత కమిటీలో చేర్చారంటూ నలుగురు రాజ్యసభ ఎంపీలు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక హక్కుల ఉల్లంఘన కింద ఆయనపై చర్యలు తీసుకున్నారు. అనంతరం దీనిపై సభా హక్కుల కమిటీ దర్యాప్తు చేపట్టింది.

తాజాగా ఈ కమిటీ రాజ్యసభ ఛైర్మన్‌కు నివేదిక సమర్పించింది. రాఘవ్‌ చడ్డా చర్యలు తప్పేనని ఈ కమిటీ తేల్చింది. ఈ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడుతూ.. ‘‘రెండు అభియోగాల్లో చడ్డా దోషిగా తేలారు. ఒకటి.. ఆయన ఉద్దేశపూర్వకంగా మీడియాకు వాస్తవాలను తప్పుదోవ పట్టించే సమాచారమిచ్చారని కమిటీ గుర్తించింది. ఇక, దిల్లీ బిల్లుకు సంబంధించిన ప్రతిపాదిత కమిటీలో ఆ ఎంపీల పేర్లను వారి సమ్మతి లేకుండానే చేర్చినట్లు తేలింది’’ అని తెలిపారు.

‘మీ ఓటమి అసహనాన్ని పార్లమెంట్‌లో చూపించొద్దు’: కాంగ్రెస్‌కు మోదీ సూచన

అనంతరం చడ్డాపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ భాజపా ఎంపీ తీర్మానం ప్రవేశపెట్టారు. ‘‘ఈ అభియోగాల్లో ఆయనది తప్పు అని తేలింది. అయితే ఇందుకు గానూ ఇప్పటివరకు ఆయనకు విధించిన సస్పెన్షన్‌ శిక్ష సరిపోతుంది’’ అని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. అనంతరం చడ్డాపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు.

సస్పెన్షన్‌ ఎత్తివేతపై చడ్డా స్పందించారు. ‘‘కనీసం 115 రోజుల పాటు నన్ను సస్పెండ్ చేశారు. నాకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు’’ అని ఆప్‌ ఎంపీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని