MPs Suspension: ఎంపీల సస్పెన్షన్‌ను ‘ఆయుధం’గా మార్చుకున్న ప్రభుత్వం : ఖర్గే

ఎంపీల సస్పెన్షన్‌ను (MPs suspension) అధికార పార్టీ ఓ ‘ఆయుధం’గా మార్చుకుందని విపక్షనేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

Published : 25 Dec 2023 22:20 IST

దిల్లీ: పార్లమెంటు (Parliament) శీతాకాల సమావేశాల్లో భారీ సంఖ్యలో విపక్ష సభ్యులపై సస్పెన్షన్‌ విధించడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై విపక్షనేత మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీల సస్పెన్షన్‌ను (MPs suspension) అధికార పార్టీ ఓ ‘ఆయుధం’గా మార్చుకుందని ఆరోపించారు. రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖఢ్‌కు ప్రతిస్పందనగా రాసిన లేఖలో ఖర్గే ఈ విధంగా వ్యాఖ్యానించారు.

‘ఎంపీల సస్పెన్షన్‌ను అనుకూలమైన సాధనంగా అధికార పార్టీ మార్చుకుంది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు పార్లమెంటు వ్యవహారాలను ఆయుధంగా మార్చుకున్నట్లయితే.. అణచివేతకు ఉద్దేశపూర్వ చర్యే అవుతుంది.’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

‘వాడీవేడీ చర్చలో ఉన్నా.. నవ్వులు పూయించగలరు’: వాజ్‌పేయీ జయంతి వేళ మోదీ నివాళి

ఉభయసభల నుంచి భారీ సంఖ్యలో సభ్యులను సస్పెన్షన్‌ చేయడం ప్రభుత్వ ముందస్తు వ్యూహంగానే కనిపిస్తోందని ఖర్గే పేర్కొన్నారు. సభలో లేని ఇండియా కూటమి సభ్యుడినీ సస్పెండ్‌ చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే, ఇవన్నీ ఛైర్మన్‌ విచక్షణాధికారాల కిందకు వస్తాయనే విషయం తెలుసన్నారు. అయినప్పటికీ, భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి పార్లమెంటులో ప్రకటన చేయకుండా సభ జరుగుతోన్న సమయంలోనే ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడటాన్ని తప్పుపట్టారు.

ఇదిలాఉంటే, సభా కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించనీయకుండా రాజ్యసభ ఛైర్‌పర్సన్‌ను ప్రతిపక్షాలు అడ్డుకోవడం దురదృష్టకరమని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఇటీవల పేర్కొన్నారు. ఆ సమయంలో తనను కలిసేందుకు ప్రతిపక్ష నేత తిరస్కరించడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమని అన్నారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు డిసెంబర్‌ 22న ఆయన లేఖ రాశారు. ధన్‌ఖడ్‌ లేవనెత్తిన ప్రశ్నలకు ఖర్గే పైవిధంగా బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని