SBI: ఆర్‌టీఐ కింద ఎన్నికల బాండ్ల వివరాలిచ్చేందుకు ఎస్‌బీఐ నిరాకరణ

ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఆర్‌టీఐ కింద ఇచ్చేందుకు ఎస్‌బీఐ నిరాకరించింది.

Published : 11 Apr 2024 16:17 IST

Electoral bonds | దిల్లీ: ఎన్నికల బాండ్లకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు (EC) ఇచ్చిన వివరాలను సమాచార హక్కు చట్టం (RTI) కింద ఇచ్చేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో వివరాలు అందుబాటులో ఉండగా.. విశ్వసనీయ సమాచారం అంటూ కారణం చూపి సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తును తిరస్కరించింది.

ఎలక్టోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని ఎస్‌బీఐని ఆదేశించింది. దీంతో బ్యాంక్‌ సమర్పించిన వివరాలను ఈసీ మార్చి 14న తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది. ఈనేపథ్యంలో ఆర్‌టీఐ కార్యకర్త కమోడోర్‌ (రిటైర్డ్‌) లోకేశ్‌ బాత్రా ఎస్‌బీఐకి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. సుప్రీం ఆదేశాల ప్రకారం ఈసీకి సమర్పించిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని అందివ్వాలని మార్చి 13న ఆర్‌టీఐ కింద దరఖాస్తు చేసుకున్నారు.

సైనిక స్కూళ్లపై కాంగ్రెస్ ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన కేంద్రం

బాత్రా దరఖాస్తును ఎస్‌బీఐ తిరస్కరించింది. సమాచారహక్కు చట్టంలోని రెండు క్లాజులను ప్రస్తావిస్తూ విశ్వసనీయ సమాచారం, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా తాము దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. ఎన్నికల బాండ్ల విషయంలో ఎస్‌బీఐ తరఫున సుప్రీంకోర్టులో వాదించిన సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వేకు ఫీజు రూపంలో ఎంత చెల్లించారన్న వివరాలనూ బాత్రా కోరాగా.. ఆ వివరాలనూ సమర్పించేందుకు ఎస్‌బీఐ నిరాకరించింది. ఈసీ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాలను ఇవ్వడానికి ఎస్‌బీఐ తిరస్కరించడం విచిత్రంగా ఉందంటూ బాత్రా పేర్కొన్నారు. ప్రజల పన్నులతో ఫీజు చెల్లించి.. దానికి సంబంధించిన సమాచారం నిరాకరించడాన్ని తప్పుబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు