Sharad Pawar: అదే ఎన్నికల గుర్తు వాడుకోండి.. శరద్‌ పవార్‌ వర్గానికి ‘సుప్రీం’ అనుమతి

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో శరద్‌ పవార్ వర్గానికి ‘ఎన్సీపీ-శరద్‌చంద్ర పవార్‌’ అనే పార్టీ పేరును ఉపయోగించుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది.

Published : 19 Mar 2024 19:33 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ శరద్‌ పవార్‌ (Sharad Pawar) వర్గం పార్టీ పేరు, ఎన్నికల చిహ్నం విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఎన్సీపీ- శరద్‌చంద్ర పవార్‌’ అనే పార్టీ పేరును, ‘బాకా ఊదుతోన్న వ్యక్తి’ గుర్తును ఉపయోగించుకునేందుకు అనుమతించింది. ఈమేరకు పేరు, చిహ్నాన్ని గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ECI), రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (SEC)లను ఆదేశించింది. ఆ గుర్తును ఇతర పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించొద్దని సూచించింది.

అజిత్‌ పవార్‌ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించిన ఈసీ.. ఆ పార్టీ జెండా, ఎన్నికల గుర్తు (గడియారం)ను కూడా వారికే కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో సమాన అవకాశాలను దెబ్బతీస్తుందని పేర్కొంటూ.. ఎన్సీపీ ఆ గుర్తును ఉపయోగించకుండా ఆదేశించాలని కోరుతూ శరద్ వర్గం ‘సుప్రీం’ను ఆశ్రయించింది. జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి.. ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.

అజిత్‌దే అసలైన ‘ఎన్సీపీ’.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు తిరస్కరణ

మరోవైపు.. ‘గడియారం’ గుర్తు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, న్యాయ నిర్ణయానికి లోబడే దాన్ని వినియోగిస్తున్నట్లు వార్తాపత్రికల్లో పబ్లిక్‌ నోటీసు జారీ చేయాలని అజిత్‌ వర్గానికి సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రకటనలు, ప్రచార సామగ్రిలోనూ ఈ విషయాన్ని వెల్లడించాలని చెప్పింది. అసలైన ఎన్సీపీగా గుర్తిస్తూ ఫిబ్రవరి 6న ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ శరద్ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని అజిత్‌ వర్గాన్ని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని