Electoral Bonds: ఎన్నికల బాండ్ల నంబర్లూ చెప్పాల్సిందే.. ఎస్‌బీఐకి సుప్రీం డెడ్‌లైన్‌

Electoral Bonds: ఎన్నికల బాండ్ల నంబర్లను ఈసీకి ఇవ్వకపోవడంతో ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. మార్చి 21లోగా అన్ని వివరాలు ఇవ్వాల్సిందేనని డెడ్‌లైన్‌ విధించింది.

Updated : 18 Mar 2024 12:15 IST

దిల్లీ: ఎన్నికల బాండ్ల (Electoral Bonds) వ్యవహారంలో భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(SBI)పై సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాల ప్రకారం బాండ్ల నంబర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వకపోవడంపై బ్యాంకును నిలదీసింది. నంబర్లతో సహా అన్ని వివరాలను ఈసీ (EC)కి ఇచ్చి మార్చి 21లోగా తమకు ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని ఎస్‌బీఐని ఆదేశించింది.

‘‘బాండ్ల విషయంలో ఎస్‌బీఐ సెలెక్టివ్‌గా ఉండకూడదు. దీనికి సంబంధించిన ప్రతి సమాచారం బయటకు రావాలి. దేన్నీ అణచివేయకూడదనే ఉద్దేశంతోనే అన్ని వివరాలను ఇవ్వాలని మేం తీర్పు చెప్పాం. ఏ దాత ఏ పార్టీకి ఎంత ఇచ్చారనే విషయాన్ని తెలియజేసే యునిక్‌ నంబర్లతో పాటు అన్ని వివరాలను ఎస్‌బీఐ ఈసీకి ఇవ్వాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహాలకు ఇక తావులేదు’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

సింహభాగం భాజపాకే.. ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం రూ.8,718.5 కోట్లు

ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను (నంబర్లతో సహా) ఈసీకి ఇచ్చేశామని చెబుతూ మార్చి 21 (గురువారం) సాయంత్రం 5 గంటల్లోగా సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎస్‌బీఐ ఛైర్మన్‌ను ధర్మాసనం ఆదేశించింది. వివరాలు అందిన వెంటనే వాటిని ఎన్నికల సంఘం తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది.

ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గత ఐదేళ్లలో జారీ చేసిన బాండ్ల వివరాలను ఈసీకి అందించాలని ఎస్‌బీఐని ఆదేశించింది. ఆ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన బ్యాంకు.. బాండ్ల ఆల్ఫా న్యూమరిక్‌ నంబర్లను మాత్రం బయటపెట్టలేదు. ఏ వ్యక్తి/సంస్థ బాండ్లను ఏ పార్టీకి విరాళంగా ఇచ్చారని తెలిపే ఈ నంబర్లు లేకపోవడంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బ్యాంకు తీరుపై అసహనం వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని