సింహభాగం భాజపాకే..

ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీలకు అందిన మొత్తాల మరో జాబితా బహిర్గతమైంది. భాజపాకు మొత్తంమీద రూ.8,718.5 కోట్లు విరాళంగా వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఆదివారం అందుబాటులోకి తెచ్చిన డేటాను బట్టి తెలుస్తోంది.

Published : 18 Mar 2024 03:56 IST

ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం రూ.8,718.5 కోట్లు
ఇతర పార్టీలకూ గణనీయ స్థాయిలోనే నిధులు
ఫ్యూచర్‌ గేమింగ్‌ సంస్థ నుంచి డీఎంకేకు రూ.509 కోట్లు
ఈసీ వెబ్‌సైట్‌లో తాజా గణాంకాలు

దిల్లీ: ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీలకు అందిన మొత్తాల మరో జాబితా బహిర్గతమైంది. భాజపాకు మొత్తంమీద రూ.8,718.5 కోట్లు విరాళంగా వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఆదివారం అందుబాటులోకి తెచ్చిన డేటాను బట్టి తెలుస్తోంది. ఎన్నికల బాండ్ల పథకం ప్రారంభమైన 2018 మార్చి నుంచి రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న బాండ్ల వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది. ఇందులో గుర్తింపు పొందిన, పొందని 523 రాజకీయ పార్టీల సమాచారం ఉంది. ఈ డేటాతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) వెల్లడించిన 2019 ఏప్రిల్‌ 12, 2024 జనవరి 24 మధ్య సమాచారాన్ని పోల్చుకుంటే.. రాజకీయ పార్టీలు అందుకున్న విరాళాల మొత్తాలు మరింతగా పెరిగాయి.

తాజా లెక్క ప్రకారం.. 2019 ఏప్రిల్‌ 12కు ముందు భాజపాకు రూ.2,658.35 కోట్ల విలువైన బాండ్లు వచ్చాయి. అంతేకాదు.. ఆ కాలంలో మొత్తం రాజకీయ పార్టీలకు లభించిన విరాళాల్లో కాషాయ పార్టీకే 66 శాతం దక్కాయి. అదే సమయంలో కాంగ్రెస్‌కు రూ.530.1 కోట్లు వచ్చాయి. హస్తం పార్టీ విరాళాల మొత్తం రూ.1,864.45 కోట్లుగా తేలింది. 2019 ఏప్రిల్‌ 12కు ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌ రూ.97.28 కోట్ల విలువైన బాండ్లను నగదుగా మార్చుకుంది. ఆ పార్టీ మొత్తం విరాళాలు రూ.1,494.28 కోట్లు. భారాస ఎలక్టోరల్‌ బాండ్ల కింద మొత్తంమీద రూ.1,408.20 కోట్ల విరాళాలు అందుకుంది.

  • ఎన్నికల బాండ్లతో తమకు ఒక్క రూపాయి కూడా విరాళంగా అందలేదని పలు రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు తెలిపాయి. ఇందులో బహుజన్‌ సమాజ్‌ పార్టీ, ఏఐఎంఐఎం, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌, మేఘాలయకు చెందిన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ ఉన్నాయి.
  • తమకు రూ.10 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళంగా వచ్చాయని.. కానీ దాత ఎవరో తెలియదని జేడీ (యూ) పేర్కొంది. 2019లో పార్టీ కార్యాలయానికి ఓ కవరులో బాండు పత్రాలు వచ్చాయని, నగదుగా మార్చుకున్నామని ఈసీకి తెలిపింది.
  • ఈసీ డేటా ప్రకారం.. తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకేకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నిఘాలో ఉన్న ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ రూ.509 కోట్ల విలువైన బాండ్లను విరాళంగా ఇచ్చింది. ఆ సంస్థతోపాటు.. మేఘా ఇంజినీరింగ్‌ (రూ.105 కోట్లు), ఇండియా సిమెంట్స్‌ (రూ.14 కోట్లు), సన్‌ టీవీ (రూ.100 కోట్లు) కూడా డీఎంకేకు విరాళాలు అందించాయి. ఫ్యూచర్‌ గేమింగ్‌ దేశంలో అత్యధికంగా రూ.1,368 కోట్లు విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ఇందులో రూ.509 కోట్లు డీఎంకేకు ఇవ్వగా మిగిలిన రూ.859 కోట్లను ఆ సంస్థ ఏ రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చిందో స్పష్టత లేదు.
  • జేడీ(ఎస్‌)కు రూ.89.75 కోట్ల విలువైన బాండ్లు లభించాయి. ఇందులో మేఘా ఇంజినీరింగ్‌ రూ.50 కోట్ల బాండ్లను విరాళంగా ఇచ్చింది.
  • ఎన్నికల బాండ్ల పథకం ద్వారా విరాళాలు స్వీకరించకూడదని తాము విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని సీపీఐ, సీపీఎం, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, సీపీఐ-ఎంఎల్‌ పార్టీలు ఈసీకి తెలిపాయి.

ఎన్నికల బాండ్లు ఒక ప్రయోగం: ఆరెస్సెస్‌

నాగ్‌పుర్‌: ఎన్నికల బాండ్లపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే కీలక వ్యాఖ్యలు చేశారు. బాండ్ల విధానం ఒక ‘ప్రయోగం’ మాత్రమేనని, ఇవి ఉపయోగకరమా కాదా అన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని